
శ్రీ గండి వీరాంజనేయస్వామి దేవస్థానంలో శ్రావణ మాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ దేవాలయం ఏపీలోని కడప జిల్లాలో వేంపల్లె సమీపంలోని గండి గ్రామంలో ఉంది. ఈ ఆలయంలో హనుమంతుడు కొలువై ఉంటాడు. మొదటి శ్రావణ శనివారం కావడంతో అంజన్నను ప్రత్యేకంగా తెప్పించిన పూలతో అర్చకులు అలంకరించారు. నేటి నుంచి నాలుగు శనివారాల పాటు శ్రావణ మాస ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఆలయానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఈ క్షేత్రం ఈనాటిది కాదట.. రామాయణం కాలం అంటే త్రేతాయుగం నాటిదని అంటారు.
త్రేతాయుగంలో శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో సీతాదేవిని రావణుడు అపహరించగా.. రామలక్ష్మణులు సీతాన్వేషణలో దండకారణ్యం నుంచి గండిక్షేత్రం మీదుగా వచ్చారట. అప్పటికే వాయుక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన గండిక్షేత్రంలో వాయుదేవుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడట. రామలక్ష్మణులను చూసిన వాయుదేవుడు వారికి సాదర స్వాగతం పలికి ఆతిథ్యం స్వీకరించమని వేడుకొనగా తిరుగు ప్రయాణంలో స్వీకరిస్తామని మాటిచ్చారట. రావణ సంహారం తరువాత అయోధ్యకు తిరిగి వస్తుండగా.. మార్గమధ్యంలోని గండిలో వాయుదేవుడు స్వాగతం పలికాడు. శ్రీరాముడు ఆ రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకున్నాడు. మరుసటి రోజు అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని చూసి ముగ్ధుడయ్యాడట. ఇక సీతాన్వేషణ, రావణ సంహారంలో కీలకంగా మారిన వీరాంజనేయుడి చిత్రాన్ని తన బాణపు కొసతో కొండశిల మీద చిత్రించాడు. చిత్రం చివరిదశలో లక్ష్మణుడు వచ్చి కాలహరణం సంగతి గుర్తుచేయగా ఆ తొందరలో శ్రీరాముడు ఆంజనేయుని చిత్రం ఎడమచేతి చిటికెనవ్రేలు విడదీయకుండా వెళ్ళిపోయాడట. ఆ చిత్రరూపమే ఇప్పటికే వీరాంజనేయునిగా పూజలందుకుంటోంది.
