
మకర సంక్రాంతికి ఇంకెన్నో రోజులు లేదు. సంక్రాంతి పండుగ నాడు ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మకర సంక్రాంతి నాడు ఆవు నేతితో శివలింగానికి అభిషేకం చేస్తారు, ఆయుఃకారకం. కొంచెం పేరుకున్న నెయ్యి తీసి గడ్డలా ఉన్నదానిని శివలింగం మీద పెట్టి, కరిగిన నేతితో అభిషేకం చేస్తారు. తులసి దళాల తోటి, సుగంధభరితమైన పుష్పాల తోటీ విష్ణ్వారాధన. మకర సంక్రమణం రోజున సూర్యభగవానుడి పట్ల భక్తి ప్రపత్తులతో, ఆయన ఉదయించక ముందే నిద్రలేచి, ఆయనకి స్వాగతం పలికి ఆయన పట్ల కృతఙ్ఞతాభావం ప్రకటిస్తారు.
మకర సంక్రమణం రోజున పెరుగు దానం చేస్తారు. పెరుగును ఎందుకు దానం చేస్తారో తెలుసుకుందాం. ఒక చోటైతే, అసలు ఆ పెరుగు దానం చేస్తే తప్ప నంద, యశోదలకి శ్రీకృష్ణ పరమాత్మ పుట్టలేదు అంటారు. అలాడే బూడిద గుమ్మడి కాయను కూడా దానం చేస్తారు. బూడిద గుమ్మడికాయ దానం చేస్తే మంచి ఆరోగ్యం కలుగుతుంది. ఇక అవతలివారి అవసరమును బట్టి, తన శక్తిని బట్టి లోహములు దానం చేస్తారు. ఇవే కాకుండా వస్త్రములు, ద్రవ్యము, ధాన్యము, ఉదకభాండము వంటివన్నీ కూడా దానం చేస్తారు.
