వినాయక చవితిని ఈ నెల 7వ తేదీన దేశమంతా జరుపుకోబోతున్న విషయం తెలిసిందే. అదే రోజున మరికొన్ని శుభ యోగాలు కూడా ఏర్పడనున్నాయి. ఇవి వినాయకచవితిని మరింత స్పెషల్‌గా మార్చబోతున్నాయి. ఆ రోజున ఏర్పడనున్న యోగాల్లో సర్వార్థ సిద్ధి యోగం, రవి యోగం, బ్రహ్మ యోగం ఉన్నాయి. అంతేకాకుండా వినాయక చవితి రోజున అన్ని గ్రహాల స్థానం పరిపూర్ణంగా ఉంటుందట. కాబట్టి ఈ ఏడాది వినాయక చవితి అన్ని రకాలుగా చాలా బాగుందట. సర్వార్ధ సిద్ధి యోగంలో పూజ చేస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. అసలు ఈ యోగం ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుందో చూద్దాం.
సర్వార్ధ సిద్ధి యోగం 7వ తేదీ మధ్యాహ్నం 12:34 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 6:30 గంటల వరకూ కొనసాగుతుంది. కాబట్టి ఈ యోగ సమయంలో వినాయకుడిని పూజించుకుంటే చాలా మంచిదట. ఇక రవి యోగం వచ్చేసి సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం 9.25 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 12.34 గంటల వరకు కొనసాగుతుంది. ఈ రోజున బ్రహ్మయోగం కూడా ఏర్పడటం కూడా చాలా మంచిదట. ఇక వినాయకుడిని పూజించుకునేందుకు మంచి సమయం రెండున్నర గంటల పాటు ఉండనుంది. ఉదయం 11:03 నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 01:34 వరకూ ఎప్పుడైనా వినాయకుడిని పూజించుకోవచ్చు.