నిర్మాణ నైపుణ్యమో.. మరొకటో కానీ ఆ ఆలయ చిత్రాలు అన్నీ ఇన్నీ కావు. ఆలయానికి నలువైపులా పెద్ద పెద్ద గుట్టలు ఉంటాయి. ఇక గర్భగుడిలోకి వెళ్లాలంటే నాలుగు ప్రధాన ద్వారాలను దాటుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. అయినా సరే.. ఏడాదిలో మూడు రోజుల పాటు ఆలయంలోని శివలింగంపై సూర్యకిరణాలు పడతాయి? అవి ఎలా పడతాయనేది ఎవరికీ అంతు పట్టడం లేదు. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుంది? ఏడాదిలో సూర్య కిరణాలు పడే మూడు రోజులేంటి? వంటి అంశాలను తెలుసుకుందాం. హనుమకొండలో సిద్దేశ్వరాలయం ఉంటుంది. ఇక్కడ శివుడు స్వయంభువుగా వెలిశాడని నమ్మకం. 1100 ఏళ్ల క్రితం శివుడు వెలిశాడని చెబుతారు.
ఇక ఈ ఆలయానికి ముందు భాగంలో మండపం.. దానికి ముందు ప్రధాన ద్వారానికి సంబంధించిన ఆర్చి ఉంటుంది. దానికి ముందు పద్మాక్షి గుట్టపై దేవాలయం ఉంటుంది. ఆలయానికి కుడి వైపున హనుమత్‌గిరి కొండ, ఎడమ వైపున కాల భైరవ కొండ, వెనుక వైపు లక్ష్మీ నరసింహస్వామి గుట్ట, ముందు వైపు పద్మాక్షి దేవాలయం గుట్ట ఉంటాయి. ఇలా నలువైపులా గుట్టలు, పడమటి ముఖ ద్వారం.. ఆలయం ముందు నంది మండపం.. పైగా ఆలయం లోపలికి వెళ్లాలంటే భక్తలు కిందకి వంగి వెళ్లాల్సిందే. ద్వారాల ఎత్తు అంత తక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో సూర్య కిరణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలయంలోకి పడే అవకాశం లేదు. ఇలాంటి ఆలయంలోకి ముఖ్యంగా వినాయకచవితి సమయంలో మూడు రోజుల పాటు సూర్య కిరణాలు శివలింగాన్ని తాకుతాయి. అవి అసలు ఎవరికీ అంతుపట్టని అద్భుతం.