ఘుష్మేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం గురించి ఇప్పటికే తెలుసుకున్నాం. ఈ జ్యోతిర్లింగ క్షేత్రం మహారాష్ట్రలోని దౌల్తాబాద్‌లోని బెరల్‌గావ్‌లో ఉంది. దీనికి సంబంధించిన పురాణ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దక్షిణ దేశంలోని దేవగిరి పర్వతం సమీపంలో నివసించే సుధర్మ, సుదేహ అనే బ్రాహ్మణ దంపతులకు సంతానం లేదు. దీంతో ఇద్దరూ తీవ్ర ఆందోళన చెందారు. ఇక తనకు పిల్లలు పుట్టరని నిర్ణయించుకున్న సుదేహ.. తన చెల్లి ఘుష్మతో చెల్లి పెళ్లి జరిపించింది. ఘుష్మ గొప్ప శివ భక్తురాలు. పెళ్లైన కొంత కాలానికే పరమేశ్వరుని దయతో ఘుష్మకు పండంటి బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డను చూసుకుని ఘుష్మా దంపతులు ఆనందంగా గడపసాగారు.
ఘుష్మ దంపతులు ఆనందంగా ఉండటం ఆ ఆనందం ఆ పసివాడి కారణంగానేనని భావించిన సుదేహ బిడ్డను చంపి చెరువులో పడేసింది. ఘుమ్మ ఆవేదనకు అంతు లేకుండా పోయింది. తీవ్ర ఆవేదనకు గురైన ఘుష్మ.. ఆ సమయంలోనూన శివ పూజను వీడలేదు. పూజకు వేళవగానే దు:ఖాన్ని మరచి మళ్లీ యథావిధిగా శివపూజకు ఉపక్రమించింది. ఘుష్మ భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఆమె కుమారుడిని బతికించాడు. దీంతో ఆమె శివుడిని అక్కడే ఉండిపోవాలని కోరింది. ఘుష్మ కోరిక మేరకు జ్యోతిర్లింగ రూపంలో శివుడు అక్కడ నివసించడం ఆరంభించాడు. ఆమె పేరుతోనే అక్కడి శివుడు ఘుష్మేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు.