
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలో కొలువైన శ్రీ కనకదుర్గ దేవస్థానం(పెద్దమ్మ గుడి) ఆవరణలో శివాలయం ప్రతిష్ట, ధ్వజ స్తంభం ప్రతిష్ట మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అయితే అవి నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం ఆలయ అధికారులు జలాధివాసం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి మహిళా భక్తులంతా పసుపు రంగు వస్త్రాలు ధరించి రావాలని సూచించారు. వచ్చిన వారికి కనీసం తీర్థ ప్రసాదాలు ఇవ్వలేదని భక్తులు ఆరోపిస్తున్నారు. ప్రతిష్ట మహోత్సవ పూజా కార్యక్రమాల్లో ఆలయ ఈవో దంపతులు పాల్గొనాలి. కానీ ఆలయ ఈవోకి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలుపడదు.
ఆలయ ఈవోకి వీలుపడని పక్షంలో ఆలయంలోని సీనియర్ అసిస్టెంట్ స్థాయి అధికారుల దంపతులు, జిల్లాస్థాయి ఉన్నతాధికారుల దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆలయ ఈవో ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ అసిస్టెంట్ స్థాయి అధికారుల స్థానంలో తన కొడుకు, కోడలు పూజా కార్యక్రమాలతో పూజ చేయించారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శివాలయంలో నూతనంగా ప్రతిష్ట చేయనున్న శివపరివార విగ్రహాలకు శాస్త్ర ప్రకారం పూజలు నిర్వహించే అర్చకుల్లోనూ అనర్హులకే పెద్దపీట వేశారని ఆరోపణలు ఉన్నాయి. మొత్తానికి విమర్శల నడుమ ప్రతిష్టా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
