ఆదాయం విషయంలో తిరుమలతో పోటీ పడిన షిర్డీ

ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి పేరుంది. ప్రతి రోజూ తిరుమల హుండీ ఆదాయం దాదాపు రూ.4 కోట్లు ఉంటుంది. ప్రస్తుతం శ్రీవారి ఆలయానికి పోటీగా మరో క్షేత్రం వచ్చింది. అదే మహారాష్ట్రలోని షిర్డీ క్షేత్రం. ఇక్కడ ఆషాఢ మాసంలోని పౌర్ణమిని గురు పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటారు. ఈ ఉత్సవాలు ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు కొనసాగాయి. ఈ ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే సాయిబాబాకు మూడు రోజుల్లో రూ.6 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందట. ఈ విషయాన్ని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సీఈఓ గోరక్షా గాడిల్కర్ వెల్లడించారు.

ముఖ్యంగా గురు పూర్ణిమ సందర్భంగా నగదు రూపంలో రూ. 2 కోట్ల 50 లక్షల ఆదాయం లభించిందట. ఇక డెబిట్/క్రెడిట్ కార్డ్‌లు, ఆన్‌లైన్ లో కోటికి పైగా విరాళం వచ్చినట్లు సంస్థాన్ ట్రస్ట్ చెబుతోంది. చెక్కులు, మనీ ఆర్డర్‌ల రూపంలో సుమారు రూ. 2 కోట్ల వచ్చినట్లు గాడిల్కర్ వెల్లడించారు. సాయి బాబా స్పెషల్ దర్శనం కోసం రూ. 200 టికెట్లు ఇచ్చారట. ఇక లడ్డు కవర్ల అమ్మకం ద్వార రూ.62 లక్షలకు పైగా ఆదాయం లభించిందట. మూడు రోజుల్లో షిర్డీ సాయిబాబా ఆలయాన్ని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. ముఖ్యంగా జపాన్‌కు చెందిన భక్తులు సైతం సాయినాథుని దర్శించుకున్నారు. వీరు ప్రతి గురు పౌర్ణమికి వచ్చి షిర్డీ సాయిని దర్శించుకుంటూ ఉంటారట.

Share this post with your friends