
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో విజయవంతం చేయాలని టీటీడీ అదనపు శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో గురువారం సాయంత్రం టీటీడీ అదనపు ఈవో సమక్షంలో శ్రీ మలయప్ప స్వామివారి బ్రహ్మోత్సవాల భద్రత ఏర్పాట్లపై సీవీఎస్వో శ్రీ శ్రీధర్, జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు సమీక్ష నిర్వహించారు. అక్టోబరు 4 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించే శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు టీటీడీ, పోలీసు, సంబంధిత విభాగాల అధికారులంతా సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు.
ఇక్కడ ఉన్న చాలామంది అధికారులకు అనేక బ్రహ్మోత్సవాలను చూసిన, పనిచేసిన అపారమైన అనుభవం ఉందన్నారు. వారి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలన్నారు. ముందుగా టీటీడీ సీవీఎస్వో నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, ఎదురయ్యే సవాళ్లు, అధిగమించేందుకు తీసుకోవలసిన చర్యలు, పార్కింగ్ స్థలాలు, రోప్ పార్టీలు, సంబంధిత సమస్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను అందించారు. అనంతరం తిరుపతి ఎస్పీ వార్షిక ఉత్సవాల సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులకు చేయనున్న భద్రతా చర్యలను వివరించారు. ఈ సమావేశంలో టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ, జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.
