తెలంగాణ బోనాలకు చైర్మన్‌గా రేవంత్ రెడ్డి..

తెలంగాణ బోనాలకు కమిటీ సిద్ధమైంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్‌గా కమిటీ ఏర్పాటైంది. తెలంగాణ బోనాలు జూలై 7 నుంచి ప్రారంభం కానున్నాయి. దీనిపై నేడు మంత్రి కొండా సురేఖ అధికారులకు పలు సూచనలు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని దేవాదాయ శాఖ కమిషనర్లతో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆషాడ బోనాల ఉత్సవాలు నిర్వహించాలని తెలిపారు. బోనాల నిర్వహణకు సీఎం రేవంత్ రెడ్డి రూ.20 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. ఈ మొత్తాన్ని దేవాలయాల అలంకరణ, పట్టు వస్త్రాలు కొనుగోలు, బోనాల సమాచారాన్ని తెలిపే పుస్తకాల ముద్రణ, అంబారీ నిమిత్తం ఏనుగు సేవల వినియోగం తదితర ఖర్చుల కోసం ఈ మొత్తాన్ని వినియోగించనున్నట్లు మంత్రి సురేఖ తెలిపారు.

ఈ ఏడాది బోనాల నిర్వహణ నిమిత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛైర్మన్ గా రాష్ట్రస్థాయి ఉత్సవ కమిటీ ఏర్పాటైనట్టు కొండా సురేఖ తెలిపారు. ఇక తనతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, రాజ్యసభ ఎంపి అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సభ్యులుగా, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి సభ్యులు/కన్వీనర్ గా మొత్తంగా ఏడుగురితో కూడిన కమిటి బోనాల ఉత్సవ నిర్వహణ బాధ్యతలను చేపడుతుందని మంత్రి సురేఖ తెలిపారు. ఇతర ప్రధాన దేవాలయాలకు ఉత్సవ కమిటీల ఎంపిక ప్రక్రియ రెండు మూడు రోజుల్లో పూర్తవుతుందని మంత్రి తెలిపారు. పిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు.

Share this post with your friends