రంజన్ గావ్ మహా గణపతిని సాక్ష్యాత్తు పరమశివుడే ప్రతిష్టించాడట..

రంజన్ గావ్ మహా గణపతి గురించి మనం ఇప్పటికే తెలుసుకున్నాం. సూర్యుని కిరణాలు నేరుగా స్వామివారిపై పడేలా ఈ ఆలయ నిర్మాణం జరిగిందని చెప్పుకున్నాం. ఇక ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం.. ఇక్కడి మహాగణపతిని సాక్ష్యాత్తు పరమ శివుడే ప్రతిష్టించాడట. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం. గణేశ పురాణం ప్రకారం.. పరమేశ్వరుడు.. త్రిపురాసుర సంహారాన్ని గావించిన విషయం తెలిసిందే. ఈ యుద్ధానికి ముందు పరమశివుడు ఎలాంటి విఘ్నాలు కలగకుండా చూసుకునేందుకు ఇక్కడ గణపతిని ప్రతిష్టించి పూజించి ఆ తరువాత యుద్ధానికి వెళ్లాడట. మహాదేవుడు ప్రతిష్ఠించిన గణపతి కాబట్టి ఈ గణపయ్యకు మహాగణపతి అని పేరు వచ్చిందని ఆలయ స్థల పురాణం చెబుతోంది.

రంజన్ గావ్ మహాగణపతి ఆలయంలో సిద్ధి, బుద్ధి సమేతుడై పద్మంలో వినాయకుడు కొలువు తీరి ఉంటాడు. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ ఆలయంలో ప్రస్తుతం ఉన్న వినాయకుని విగ్రహం కింద పది తొండాలు, ఇరవై చేతులు గల వినాయకుడి విగ్రహం ఉందని అక్కడి స్థానికులు చెబుతారు. అంతేకాదు.. విగ్రహం పేరు కూడా స్థానికులు చెబుతున్నారు. ఆ విగ్రహం పేరు మహోత్కట్ గణపతి అట. ఆలయ ధర్మకర్తలు మాత్రం ఈ విషయాన్ని కొట్టిపడేస్తున్నారు. అది నిజం కాదని చెబుతారు. ఎవరైనా పూనుకుని పరిశోధనలు చేస్తే కానీ నిజానిజాలు తెలియవు.

Share this post with your friends