టేకుచెక్కపై రామాయణ ఇతివృత్తం..

ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెందినా కూడా చేతివృత్తులకు ఉండే ప్రాధాన్యతే వేరు. రాజుల కాలంలో కళలు, కళాకారులకు ప్రత్యేక స్థానం ఉండేది. అప్పట్లో వారి శిల్ప కళా నైపుణ్యం ఇప్పటికీ పలు దేవాలయాల్లో మనల్ని అబ్బురపరుస్తూ ఉంటుంది. ఇప్పటి వరకూ మనం దేవాలయ గోడలపై రామయణ ఇతివృత్త చిత్రాలను చూశాం. కానీ టేకు చెక్కపై చూశామా? కనకలింగ వీరబ్రహ్మం అనే వ్యక్తి టేకు చెక్కపై రామయణ ఇతివృత్త చిత్రాలను అద్భుతంగా చెక్కాడు. అతని కళా నైపుణ్యం చూపరులను ఆకట్టుకుంటోంది. తలుపులపై దేవుడి బొమ్మలు చెక్కడం, సిమెంట్‌ దిమ్మెలపై శిల్పాలు చెక్కడంలో వీరబ్రహ్మం నైపుణ్యం సాధించారు.

వీరబ్రహ్మం స్వగ్రామం.. ఏపీలోని ఏలూరు జిల్లా చింతపూడి. రామాయణ ఇతివృత్తం గల పాత్రలు, వాటి విశిష్ఠతలను తెలుపుతూ రెండు అడుగుల మందం.. 20 అంగుళాల వెడల్పు, 30 అంగుళాల ఎత్తుగల టేకు చెక్కపై రామాయణ ఇతివృత్తం చెక్కారు. దీనిని చెక్కేందుకు వీరబ్రహ్మంకు మూడు నెలల సమయం పట్టింది. తన తాత యర్రవరపు శేషయ్యే తనకు స్ఫూర్తి అని.. ఆయన కారణంగానే తనకు ఇంతటి నైపుణ్యం వచ్చిందని వీరబ్రహ్మం తెలిపారు. తన తాత 1936లోనే చెక్కపై రైలు ఇంజిన్ బొమ్మ చెక్కి బ్రిటీష్ వారి నుంచి గోల్డ్ మెడల్ అందుకున్నారని తెలిపారు. మొత్తానికి చెక్కపై రామాయణ ఇతివృత్తాన్ని చూసిన వారంతా అచ్చెరువొందుతున్నారు.

Share this post with your friends