ప్రయాగ్‌రాజ్‌లో జరగనున్న మహా కుంభమేళా కోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. పుష్య పూర్ణిమ రోజైన జనవరి 13న మహాకుంభమేళ ప్రారంభం కానుంది. ఈ మహాకుంభమేళాకు అఖారాలు, కల్పవాసులు రావడం ప్రారంభించడమే కాకుండా భారీగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. మహా కుంభమేళాలో నిర్వహించాల్సిన విధి విధానాలపై ప్రణాళికలు రచిస్తున్నారు. సైనికులు, మాజీ సైనికుల కోసం సైతం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సైనికులు, మాజీ సైనికుల కోసం జాతర ప్రాంతంలో టెంట్లు వేయనున్నారు. టెంట్‌లో ఉండే సైనికులు, మాజీ సైనికులు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
అలాగే సంగం, కోట లోపల బస చేసేందుకు సైనికులు, మాజీ సైనికుల కోసం ఏర్పాట్లు నిర్వహిస్తున్నట్టు ఆర్మీ ‘సూర్య కమాండ్’ ఎక్స్ వేదికగా తెలిపింది. రిటైర్డ్ సైనికులు ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. బుకింగ్ చేసుకున్న వారు జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 మధ్య ఎప్పుడైనా ప్రయాగ్‌రాజ్‌కు వచ్చి స్నానమాచరించవచ్చు. సంగం కోటలో హెల్ప్ డెస్క్, వైద్య సదుపాయాల కోసం ప్రత్యే ఏర్పాట్లు నిర్వహిస్తున్నట్టు సూర్య కమాండ్ వెల్లడించింది. కోటలో మరమ్మతు పనులు ముగింపు దశల నేపథ్యంలో ఆన్‌లైన్ బుకింగ్‌ను ప్రారంభించినట్టు తెలిపారు. సూర్య కమాండ్ తన ట్వీట్‌లో బుకింగ్ చేసుకోవాలనుకునే వారి కోసం లింక్‌ను కూడా జత చేశారు.