తిరుమలలో అనేక మండపాలున్నాయని తెలుసుకున్నాం. అయితే ఒక్కో మండపానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. తిరుమలలోని ధ్వజస్తంభ మండపానికి చాలా ప్రత్యేకత ఉంది. మరి అదేంటో తెలుసుకుందాం. 1470లో విజయనగర రాజు సాళువ నరసింహరాయలు ఈ ధ్వజస్తంభ మండపాన్ని నిర్మించారు. వెండి వాకిలిని తాకుతూ ఉండే ఈ 10 స్తంభాల మండపం ఆలయంలోని రెండవ గోపురంతో సమలేఖనం చేయబడింది. దీనిలో ధ్వజస్తంభం, బలి పీఠం ఉన్నాయి.
ఈ మండపంలోని స్తంభాలు నాటి అద్భుతమైన నిర్మాణ శైలికి తార్కాణాలుగా నిలుస్తున్నాయి. తిరుమల శ్రీ మలయప్ప స్వామివారికి జరిగే ఎన్నో ఉత్సవాల్లో ఈ మండపం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ప్రతి ఏటా జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు, చివరి రోజున ధ్వజారోహణం ఇక్కడే నిర్వహిస్తారు. ధ్వజావరోహణం కార్యక్రమాలలో దివ్య గరుడ ధ్వజాన్ని ఎగురవేయడం, దించడం చాలా ముఖ్యమైనది. బంగారు పలకలతో కప్పబడిన రాతి ఆసనాన్ని బలి పీఠంగా పేర్కొంటారు. శ్రీవారి ఆలయంలో ప్రతిరోజూ నివేదన తర్వాత, అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య ఈ పీఠంలోని దేవతలందరికీ ‘బలి’ సమర్పిస్తారు.