సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినం తిరుమల శ్రీవారి ఆలయంలోశాస్త్రోక్తంగా జరిగింది. ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతినాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం శ్రీ రంగనాథస్వామి తరఫున శ్రీ మలయప్ప స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మంగళవారం ఉదయం శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కన గల తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి మఠంలో శ్రీవారి సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అక్కడి నుంచి తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి శ్రీ శేఖర్ బాబు, తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం కలిసి పట్టువస్త్రాలను మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా నాలుగు మాడ వీధుల ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు దేవాదాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీ కుమార గురుబాలన్, శ్రీరంగం ఆలయ ఆలయ జాయింట్ కమిషనర్ శ్రీ మారియప్పన్, తదితరులు పాల్గొన్నారు.