ఈ స్వామివారికి నైవేద్యంతో పాటు వేపపొడిని సమర్పిస్తారు.. కారణమేంటంటే..

జగన్నాథుడికి 56 రకాల నైవేద్యాలను సమర్పిస్తారని అందుకు కారణాలను కూడా తెలుసుకున్నాం. మరి ఈ నైవేద్యాలతో పాటు వేప పొడిని సైతం నైవేద్యంగా సమర్పిస్తారట. అదెందుకు అంటారా? దీనికీ ఓ కారణముంది. ఒక వ్యక్తి పూరీలో జగన్నాథునికి ప్రతిరోజూ 56 రకాల వంటకాలు నైవేద్యంగా సమర్పించేవాడట. అయితే ఓ మహిళకు కుటుంబం లేదట.. ఆమె జగన్నాథుడిని తన కుమారుడిగా భావించి రోజూ గుడికి వెళ్లి స్వామి ముందు కూర్చొని ప్రతిరోజూ స్వామివారికి సమర్పిస్తున్న నైవేద్యాలను చూసేదట. ఆమెకు ఒకరోజు ఏమనిపించిందంటే అన్ని ఆహారాలను తిన్న తన కుమారుడికి కడపునొప్పి వస్తుందేమోనని..

ఆ ఆలోచన రాగానే ఆ స్త్రీ వెంటనే జగన్నాథునికి వేప పొడిని తయారు చేసి.. నైవేద్యంగా పెట్టిందట. ఆలయ ద్వారం వద్ద ఉన్న సైనికులు ఆమె చేతిలోని వేపపొడిని విసిరికొట్టారట. దీంతో తన కుమారుడికి ఎక్కడ కడుపు నొప్పి వస్తుందోనని రాత్రంతా ఏడుస్తూనే ఉందట. ఆ స్త్రీ అలా ఏడుస్తూ ఉండటాన్ని చూసిన జగన్నాథుడు.. రాజు కలలో కనిపించి తన తల్లితనకు మందు ఇవ్వడాన్ని మీ సైనికులు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించాడట. జగన్నాథుని మాటలు కలలో విన్న రాజు తెల్లవారగానే ఆ స్త్రీ ఇంటికి వెళ్లి క్షమాపణలు కోరాడట. ఆ స్త్రీ మళ్లీ వేప పొడిని తయారు చేసి జగన్నాథునికి తినిపించింది. ఆ రోజు నుంచి జగన్నాథునికి 56 నైవేద్యాలతో పాటు వేపపొడిని సైతం సమర్పిస్తూ వస్తున్నారు.

Share this post with your friends