నారాయణవనం శ్రీ చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జూలై 5న మొదలైన ఈ బ్రహ్మోత్సవాలు.. ఈ నెల 14వ తేదీ వరకూ జరగనున్నాయి. ఇవాళ స్వామివారు శేషవాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయం ఇచ్చారు. మరోవైపు ఆర్జిత కల్యాణోత్సవానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లనూ నిర్వహిస్తున్నారు. దీనికి ముందు అంటే జూలై 11వ తేదీన స్వామివారి రథోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతుంటారు.
ఈ ఆర్జిత కల్యాణోత్సవం ఈ నెల 12వ తేదీన జరగనుంది. తిరుపతి నుంచి 40 కిలో మీటర్ల దూరంలో నారాయణవనం ఉంటుంది. ఇక్కడకు కోన జలపాతాలు, సినిగిరి పెరుమాళ్ కోన, అధలన కోన నారాయణవనానికి అతి దగ్గరలో ఉన్నాయి. ఇక్కడ జలపాతాలు సంవత్సరంలో 365 రోజులు ప్రవహిస్తూ ఉంటాయి. ఈ నారాయణవనంలోనే శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి దేవాలయం కూడా ఉంది. ఇక్కడే శ్రీ వేంకటేశ్వర స్వామివారికి, పద్మావతీ దేవికి వివాహం జరిగిందని అంతా చెబుతుంటారు.