తిరుమలలో నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదానికి చర్యలు

దేశ విదేశాల నుంచి ప్రతి రోజు శ్రీవారి దర్శనానికి విచ్చేసి వేలాది మంది భక్తులకు మరింత రుచికరమైన అన్న ప్రసాదాలు అందించేందుకు ఇటీవల తీసుకున్న చర్యల వల్ల నాణ్యత బాగా పెరిగిందని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు చెప్పారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని టీటీడీ ఈవో, జేఈఓ శ్రీ వీరబ్రహ్మంతో కలిసి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ, తిరుమలలో ప్రతిరోజు 2 లక్షల మందికి టీటీడీ అన్నప్రసాదాలు అందిస్తోందని తెలిపారు. భక్తులకు మరింత నాణ్యమైన, రుచికరమైన అన్న ప్రసాదాలు అందించేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఇందులో భాగంగా అన్నప్రసాద భవనంలో అధునాతనమైన శాస్త్ర, సాంకేతిక పద్ధతిలో కూరగాయలు, ముడి సరుకుల నిల్వ, పారిశుద్ధ్యము, ఆహార పదార్థాలను తనిఖీ చేసేందుకు నిపుణులైన అధికారులను నియమించడం, 10 – 15 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన అన్నపసాద తయారీ యంత్రాలను మార్చి కొత్త యంత్రాలను ఏర్పాటు చేయడం, పెరిగిన భక్తుల సంఖ్యకు అనుగుణంగా మార్పులు చేయవలసిన అవసరం ఉందన్నారు. అన్నప్రసాద విభాగంలో పనిచేస్తున్న సిబ్బందిని పెంచనున్నట్లు ఆయన చెప్పారు. ఇందుకోసం దేశంలోని ప్రముఖ చెఫ్‌లు, క్యాటరింగ్ నిపుణులతో ఏర్పాటు చేసిన కమిటీ సమగ్ర నివేదిక సమర్పించిందన్నారు. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోనున్నట్లు ఈవో వివరించారు. అన్నప్రసాద విభాగంలో టీటీడీ ఉద్యోగులు చాలా బాగా సేవలందిస్తున్నారని ఈవో అభినందించారు.

Share this post with your friends