తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి మండపాలు చాలా ఉన్నాయని తెలుసుకున్నాం. వాటిలో మహా మణి మండపం చాలా ప్రత్యేకం. ఇక్కడ చాలా కార్యక్రమాలు జరుగుతాయి. అసలు ఈ మహా మణి మండపం ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. ఆనందనిలయంలోకి ప్రవేశించగానే, బంగారు వాకిలికి.. గరుడాళ్వార్ సన్నిధి మధ్య మహామణి మండపం ఉంటుంది. స్వామివారికి నైవేద్యం సమర్పించే సమయంలో మోగించే భారీ గంట ఉన్నందున దీనిని ఘంట మండపం అని కూడా పిలుస్తారు. అంతేకాకుండా దీనిని ముఖ మండపం అనే పేరుతో కూడా పిలుస్తారు.
ఇక్కడ నాలుగు వరుసలలో మొత్తంగా 16 స్తంభాలు ఉన్నాయి. దీనిని 1417 AD లో విజయనగర సామ్రాజ్య మంత్రి మల్లన నిర్మించారు. ఈ స్తంభాలపై వరాహ, నరసింహ, మహావిష్ణు, వెంకటేశ్వర, శ్రీకృష్ణ, శ్రీరామ, వరదరాజుల శిల్పాలు కనిపిస్తాయి. ఈ మండపంలో ప్రతిరోజు తెల్లవారుజామున సుప్రభాతం పారాయణం, పంచాంగ శ్రవణం, ఆస్థానం-ఆలయ ఆస్థానం, సంవత్సరానికి ఒకసారి భోగ శ్రీనివాస మూర్తి ప్రతిష్ఠాపన రోజున సహస్ర కలశాభిషేకం, గురువారం అన్నకూత్సవం (తిరుప్పావడ సేవ) వంటి సేవలన్నీ ఈ మండపంలో మాత్రమే నిర్వహిస్తారు.