మధుర శ్రీకష్ణ జన్మభూమి వివాదంలో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. అక్కడి షాహీ ఈద్గా మసీదు భూమి హిందువులదేనంటూ 18 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని విచారణకు తీసుకున్నట్టుగా అలహాబాద్ హైకోర్టు తెలిపింది. హిందూ సంస్థల పిటిషన్లను కొట్టేయాలంటూ ముస్లిం సంస్థలు సైతం కోర్టు మెట్లెక్కడంతో అలహాబాద్ హైకోర్టు ఈ తీర్పును వెలువరించింది. షాహీ ఈద్గా మసీదులో పూజలకు అనుమతించాలని.. మసీదులోని రెండున్నర ఎకరాల భూమి శ్రీకృష్ణ జన్మభూమి ఆలయానికే చెందుతుందని హిందూ సంస్థలు వాదించాయి. పైగా మసీదు కమిటీ దగ్గర భూమికి సంబంధించి ఎలాంటి రికార్డులూ లేవని హిందూ సంస్థలు స్పష్టం చేశాయి.
జూన్ 6న విచారణ అనంతరం, ముస్లిం పక్షం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ మయాంక్ కుమార్ జైన్ విచారణ నిర్వహించారు. అప్పుడు ఆ నిర్ణయాన్ని ఆయన రిజర్వ్ చేశారు. అయితే తాజాగా అలహాబాద్ హైకోర్టులోని జస్టిస్ మయాంక్ కుమార్ జైన్‌తో కూడిన సింగిల్ బెంచ్ షాహి ఈద్గా మసీదు ట్రస్ట్ దరఖాస్తును తిరస్కరించింది. అయితే ముస్లి పెద్దలు కూడా ఈ విషయమై తగ్గేలా కనిపించడం లేదు. ఈ నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేయనున్నట్టు చెబుతున్నారు. అసలు ఈ కేసును విచారించే అధికారం సివిల్ కోర్టుకు లేనే లేదని చెబుతున్నారు.