ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలోని త్రియుగి నారాయణ్ ఆలయం గురించి తెలుసుకున్నాం కదా.. ఈ ఆలయం గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. రుద్రప్రయాగ్ జిల్లాలోని సుందరమైన గ్రామంలో త్రియుగినారాయణ ఆలయం ఉంటుంది. ఈ ఆలయం ప్రాంతమంతా ప్రకృతి రమణీయ దృశ్యాలతో పాటు గర్వాల్ హిమాలయాల అద్భుత దృశ్యాలతో అత్యంత అందంగా ఉంటుంది. సముద్ర మట్టానికి 1,980 మీటర్ల ఎత్తులో అక్కడి నుంచి రావాలంటే మనసు అంగీకరించదు.
బద్రీనాథ్ ఆలయాన్ని పోలి ఉండే ఈ ఆలయాన్ని దర్శించుకుంటే మనకు ఓ మధురానుభూతి సొంతమవుతుంది. మూడు యుగాలుగా ఉన్న వైష్ణవ పుణ్యక్షేత్రంగా దీనిని చెబుతారు. శివపార్వతుల వివాహం ఇక్కడే జరిగిందట. ఈ వివాహానికి అన్ని ఏర్పాట్లనూ శ్రీ మహా విష్ణువు ఏర్పాటు చేశాడని చెబుతారు. అంతేకాకుండా వివాహ సమయంలో పార్వతీదేవికి సోదరుడిగానూ.. తల్లిగానూ విష్ణుమూర్తి వ్యవహరించారట. ఇక బ్రహ్మ దేవుడు వివాహంలో పూజారి పాత్ర పోషించాడని చెబుతారు. దేవాలంయంలోకి అడుగు పెట్టగానే విష్ణువు, లక్ష్మీదేవి, సరస్వతి దేవి వెండి విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి.