కర్ణాటకలోని బెంగుళూరులో ఉన్న ఘాటి సుబ్రహ్మణ్య ఆలయం గురించి తెలుసుకున్నాం కదా. ఆది సుబ్రహ్మణ్య క్షేత్రమైన కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం, అంత్య సుబ్రహ్మణ్య క్షేత్రమైన నాగలమడక సుబ్రహ్మణ్య క్షేత్రం మధ్యలో ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం ఉంది. ఇక్కడ కార్తికేయుని విగ్రహం తూర్పు ముఖంగా ఉంటుంది. ఇక్కడ నరసింహుని విగ్రహం పడమర దిశగా ఉంటుంది. గర్బగుడిలో ఒక అద్దాన్ని ఏర్పాటు చేసి.. భక్తులు కార్తికేయుని, నరసింహ స్వామిని ఏకకాలంలో దర్శించేలా ఏర్పాటు చేశారు. ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్ర స్థల పురాణం గురించి తెలుసుకుందాం.
ఈ ప్రాంతంలోనే ఘాటికాసురుడు అనే రాక్షసుడిని సుబ్రహ్మణ్య స్వామి సంహరించాడని చెబుతారు. అందుకే ఈ ప్రాంతానికి ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రమని పేరు వచ్చిందని పేర్కొంటారు. ఘాటికాసురుని సంహరించిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడే సర్ప రూపంలో కొలువై తపస్సు చేసుకుంటున్నాడని చెబుతారు. అలాగే విష్ణుమూర్తి వాహనం అయిన గరుడుడు సర్పాలకు శత్రువు అన్న విషయం తెలిసిందే. కాబట్టి గరుడుని వల్ల ఏ ఆపద రాకుండా సుబ్రహ్మణ్యుడు విష్ణువును ప్రార్ధించాడట. అప్పుడు సర్పాలకు రక్షకుడుగా స్వామి ఇక్కడే నరసింహావతారంలో వెలిశాడని స్థలపురాణం చెబుతోంది.