మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ మండలంలో సింగోటం అనే ప్రాంతంలో ఈ అద్భుతమైన ఆలయం ఉంది. ఈ ఆలయంలో నరసింహస్వామి లింగ రూపంలో కొలువుదీరాడని తెలుసుకున్నాం కదా. దీని స్థల పురాణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని సురభి వంశానికి చెందిన సింగమనాయుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆ సమయంలోనే ఇక్కడ స్వామి ఆవిర్భవించాడని చెబుతారు. సింగపట్టణం గ్రామానికి చెందిన ఒక రైతు తన పొలం దున్నుతుండగా ఆయన నాగలికి ఏదో తగిలినట్టుగా అనిపించిందట.
దానిని రాయిగా భావించి ఎన్నిసార్లు తీసి పక్కకి పెట్టినా తిరిగి అలాగే నాగలికి అడ్డు వస్తోందట. దీంతో రైతు చేసేది లేక, తాను పేదవాడినని, పొలం పండిస్తే కానీ తన కుటుంబాన్ని పోషించలేనని, తన పనికి ఆటంకాలు కలిగించవద్దని శ్రీమన్నారాయణుడిని ప్రార్ధించాడు. అదే రోజు రాత్రి సింగమనాయుడి కలలోకి భగవంతుడు వచ్చాడట. తాను ఉత్తర దిశలో ఉన్న పొలంలో వెలిశానని చెప్పాడట. తనను రైతు గుర్తించలేక పోయాడని సైతం వెల్లడించాడట. తనని గుర్తించి, ప్రతిష్ఠించి, పూజలు జరపాలని రాజుకి భగవంతుడు చెప్పాడట. రాజు వెంటనే తన పరివారంతో వెళ్లి స్వామి చెప్పిన గుర్తుల ప్రకారం వెతికితే లింగ రూపంలో వున్న ఒక శిల కాంతులీనుతూ కనిపించింది.