
హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన గురువారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ పాండురంగస్వామి అలంకారంలో చిన్నశేష వాహనంపై అభయమిచ్చారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు, వాయిద్యాలు ఆకట్టుకున్నాయి. రెండో రోజు ఉదయం శ్రీ వేంకటేశ్వరుడు ఒక్కరే ఐదు తలలు గల చిన్నశేష వాహనాన్ని అధిష్టించారు. చిన్నశేష వాహనం శ్రీవారి వ్యక్తరూపమైన పాంచభౌతిక ప్రకృతికి సంకేతం. కనుక ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుంది. విశ్వం కన్పించే శ్రీవారి ప్రకృతి. విష్ణువు ఈ ప్రకృతికి ఆధారమై దాన్ని నడిపించేశక్తి. స్వామి విశ్వాన్ని రక్షించేవాడు కనుక శేషునిపై తానొక్కడే విహరిస్తారు.
గురువారం రాత్రి శ్రీవేంకటేశ్వరుడు శ్రీ సరస్వతీ అలంకారంలో హంస వాహనంపై అభయమిచ్చారు. హంస వాహనసేవలో శ్రీ వెంకటేశ్వరస్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచకం. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ రమేష్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు ఉన్నారు.
