శివుడు ప్రసాదించిన త్రిశూలాన్ని పొందిన లవణుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

మధురలోని గోపాలకృష్ణుని ఆలయం గురించి తెలుసుకున్నాం కదా. ఇక్కడ ఆలయాల విశేషాలను కూడా కొంతమేర తెలుసుకున్నాం. మరికొన్ని విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. గొప్ప శివ భక్తుడైన మధుడు అనే రాక్షసుడు మధురను పరిపాలించాడు. అతను తన తపస్సుతో శివుడిని మెప్పించి అజేయమైన త్రిశూలాన్ని పొందాడు. మధువుకు రావణుడు స్వయానా బావమరిది అవుతాడు. ఈ ప్రాంతానికి మధువు కారణంగానే మధువనము, మధుపురి, మధుర, మథుర అనే పేర్లు వచ్చాయి. మధుని మరణానంతరం శివుడు ప్రసాదించిన త్రిశూలాన్ని పారంపర్యంగా లవణుడు పొందాడు.

ఇక తనకు తిరుగు లేదని భావించిన లవణుడు దానితో మునులను, ప్రజలను హింసించడం ప్రారంభించారు. లవణుడి ఆగడాలను తాళలేక ప్రజలు చ్యవన మహర్షికి మొరపెట్టుకున్నారు. చ్యవన మహర్షి వెళ్లి శ్రీరామచంద్రునికి విషయాన్ని వివరించాడట. రాముడు అప్పటికే రావణాసుర సంహారం, వనవాసం పూర్తిచేసుకుని అయోధ్యను పరిపాలిస్తున్నాడు. లవణాసురునిపై యుద్ధానికి తాను వెళ్లకుండా.. రాముడు తన తమ్ముడు శత్రుఘ్నుని పంపుతాడు. శూలం లేని సమయంలో లవణాసురుని శత్రుఘ్నుడు చంపేశాడు. ఆపై మధురను వశం చేసుకున్నాడు. శత్రుఘ్నుని అనంతరం ఆయన కొడుకు శూరసేనుడు, పరంపరాగతంగా వారి వారసులు ఆ ప్రాంతాన్ని పరిపాలించారు.

Share this post with your friends