శ్రీవారి భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయాలు తీసుకుంది. అందుకు సంబంధించిన వివరాలను ఈవో జే శ్యామల రావు డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో తెలిపారు. ఆఫ్‌లైన్‌లో రోజుకు 1000 శ్రీవాణి దర్శనం టికెట్లు విడుదల చేయనుంది. శ్రీవాణి దాతలకు తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో 900, మిగిలిన 100 టికెట్లను విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్‌లో జారీ చేస్తున్నామని ఈవో జే శ్యామలరావు తెలిపారు. అన్నప్రసాదాల రుచి మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తిరుమలలో ప్రతిరోజు వేలాదిమంది భక్తులకు అందించే అన్నప్రసాదాల రుచిని మరింత పెంచేందుకు నాణ్యమైన బియ్యం, వంటశాలలో అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
అదేవిధంగా తిరుమలలో తాగునీరు, అన్నప్రసాదాలు, ముడిసరుకులను ఎప్పటికప్పుడు పరిక్షించేందుకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆధ్వర్యంలో అత్యాధునిక ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఈవో తెలిపారు. క్యూ లైన్లలో నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందజేసేలా నిర్ణయం తీసుకున్నారు. క్యూలైన్లల్లో, కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగు నీరు, పాలు, అన్న ప్రసాదాలు, పారిశుద్ధ్య నిర్వహణ, తదితర అంశాలను ఎప్పటికప్పుడు పరివేక్షించేలా ప్రత్యేకంగా కొందరు ఆధికారులకు బాధ్యతలు అప్పగించామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లలో ఆరు చోట్ల అన్నప్రసాదాలు అందించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. దళారుల చర్యవేతకు చర్యలు, భక్తులకు సరసమైన ధరలకు పరిశుభ్రమైన, రుచికరమైన ఆహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాల రుచి, నాణ్యత పెంపు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు ఈవో తెలిపారు.