తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు జ్యేష్టాభిషేక ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి మూడురోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ఏటా జ్యేష్ఠ మాసంలో శ్రీవారి ఉత్సవ విగ్రహాలకు మూడు రోజుల పాటు జ్యేష్ఠాభిషేక ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అభిషేకాలు, పంచామృత స్నపన తిరుమంజనాల కారణంగా శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు వైఖానస ఆగమోక్తంగా నిర్వహించే ఉత్సవమే జ్యేష్టాభిషేకం. శ్రీవారి ఆలయంలో మలయప్పస్వామికి ఏటా జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠా నక్షత్రానికి ముగిసేలా మూడురోజులపాటు జ్యేష్ఠాభిషేకాలు నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమాల్లో భాగంగా నేడు ఉత్సవమూర్తులకు హోమాలు, అభిషేకాలు, పంచామృత స్నపనతిరుమంజనం నిర్వహించారు. తర్వాత స్వామి, అమ్మవార్లకు వజ్రకవచాన్ని అలంకరించి మాడవీధుల్లో ఊరేగిస్తారు. రేపు స్వామివారికి ముత్యాల కవచ సమర్పణ చేసి స్వామివారిని ఆలయ మాఢ వీధుల్లో ఊరేగిస్తారు. మూడవ రోజు కూడా తిరుమంజనాదులు పూర్తి చేస్తారు. అనంతరం స్వామవారికి బంగారు కవచాన్ని సమర్పించి ఊరేగింపు నిర్వహిస్తారు. స్వామివారికి అలంకరించిన ఈ బంగారు కవచాన్ని తిరిగి వచ్చే ఏడాది నిర్వహించే జ్యేష్టాభిషేకంలోనే తీస్తారు. అప్పటి వరకూ స్వామివారు బంగారు కవచంతోనే శ్రీదేవి, భూదేవి సమేతుడై ఉంటారు.