ఇవాళ, రేపు తిరుమలలో పెద్ద ఎత్తున జన్మాష్టమి ఉత్సవాలు

ఇవాళ, రేపు తిరుమలలో పెద్ద ఎత్తున శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. తిరుమలలో ఆగ‌స్టు 27న శ్రీకృష్ణజన్మాష్టమి, ఆగ‌స్టు 28న ఉట్లోత్సవం నిర్వహ‌ణ‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శ్రీ వేంకటేశ్వరస్వామిని సాక్షాత్తు ద్వాపర యుగపురుషుడైన శ్రీకృష్ణునిగా సంస్మరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత ఆగ‌స్టు 27వ తేదీన‌ రాత్రి 8 నుండి 10 గంటల నడుమ శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తికి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంత తిరుమంజనం, ద్వాదశారాధన నిర్వహిస్తారు. అనంతరం ప్రభంద శాత్తుమొర, గోకులాష్టమి ఆస్థానం ఘనంగా చేప‌డ‌తారు.

ఆగస్టు 28న తిరుమలలో ఉట్లోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంట‌ల‌కు ఈ ఉత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై తిరుమాడ వీధులలో విహరిస్తారు. యువకులు ఎంతో ఉత్సాహంతో ఉట్లను కొడుతూ స్వామివార్లకు ఆనందాన్ని చేకూర్చుతారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 28న శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిసేవలైన ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

గోగ‌ర్భం డ్యామ్ వ‌ద్ద …

టీటీడీ ఉద్యాన‌వ‌న విభాగం ఆధ్వర్యంలో తిరుమ‌ల‌లోని గోగ‌ర్భం డ్యామ్ వ‌ద్ద ఆగ‌స్టు 27న గోకులాష్టమి వేడుక‌లు నిర్వహిస్తారు. ఇక్కడి ఉద్యాన‌వ‌నంలో వెల‌సిన కాళీయ‌మ‌ర్ధనుడైన శ్రీ‌కృష్ణునికి ఉదయం 10.30 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు అభిషేకం, నైవేద్యం స‌మ‌ర్పిస్తారు. ఈ సంద‌ర్భంగా అన్నదానం, ఉట్లోత్సవం నిర్వహిస్తారు.

Share this post with your friends