
పళని సుబ్రహ్మణ్య క్షేత్రం దేశంలోనే ప్రసిద్ధి గాంచింది. అసలు పళినికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? సాక్షాత్తు శివ పార్వతులే ఆ పేరు పెట్టారట. ఆ కథేంటంటే.. శివుడు ఒక సందర్భంలో తన ఇరువురు ప్రియ పుత్రులైన గణేశుని, కుమారులని పిలిచి, యావత్తు విశ్వాన్ని ఎవరు ముందుగా ప్రదక్షిణ చేసి వస్తారో, వారికి ఒక అద్భుతమైన ఫలాన్ని ఇస్తానని చెబుతానన్న కథ ప్రతి ఒక్కరికీ తెలిసిందే. వెంటనే కుమార స్వామి నెమలి వాహనం ఎక్కి విశ్వాన్ని చుట్టి రావడానికి బయల్దేరుతాడు.
తన వాహన వేగం ఏమిటో బాగా తెలిసిన వినాయకుడు కొద్దిసేపు ఆలోచించి, విశ్వరూపులైన తన తల్లి, తండ్రుల చుట్టూ అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ గావించి ఆ అద్భత ఫలాన్ని పొందుతాడు. త్వరత్వరగా విశ్వప్రదక్షిణం పూర్తి గావించుకొని వచ్చిన సుబ్రహ్మణ్యస్వామి జరిగిన సంగతి తెలుసుకొని అలుగుతాడు. అది చూసి శివ దేవుడు జాలిపడి ‘అన్నయ్యకు ఇచ్చిన ఫలం గురించి నీకెందుకు చింత! నీవే ఒక అద్భుత ఫలానివి ‘ఫలం – ని’! నీ పేరిట ఒక సుందర మహిత పుణ్యక్షేత్రం ఏర్పడేటట్లు అనుగ్రహిస్తున్నాను, అది నీ స్వంత క్షేత్రం, అక్కడికి వెళ్లి నివాసం ఉండు’ అంటూ కుమారుడిని శివపార్వతులు బుజ్జగించారు. దీంతో వైభవమైన ‘పళని’ రూపు దిద్దుకుందని చెబుతారు. అది కుమారుడి విశిష్ట నివాస క్షేత్రమయింది.
