
అరుణాచలం వెళ్లాలనుకునేవారు ముందుగా.. కంచి వెళ్లి అక్కడి క్షేత్రాలను దర్శించుకుంటారు. ఆ తరువాత అక్కడి నుంచి అరుణాచలానికి రోడ్డు మార్గంలో రెండుగంటల్లో చేరుకోవచ్చు. దారిలో తిరుత్తణి, శ్రీపురం ఆలయాలుంటాయి. వీటిలో తిరుత్తణి ఆలయం చాలా పురాతనమైనది. తమిళులకు ఆరాధ్య క్షేత్రం. ఇక్కడ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వల్లీ దేవసేన అమ్మవార్లు కొలువయ్యారు. స్వామి వెలసిన కొండకు ఇరువైపులా పర్వతశ్రేణులు వ్యాపించి ఉంటాయి. ఉత్తరాన ఉన్న పర్వతం కాస్త తెల్లగా ఉండటం వల్ల దీనిని ‘బియ్యపుకొండ’ అని, దక్షిణం వైపున కొండ నల్లగా ఉండటం వల్ల ‘గానుగపిండి కొండ’ అని పిలుస్తారు.
దేవతలు, మునుల బాధలు పోగొట్టడానికి శూరపద్మునితో యుద్ధం చేసిన అనంతరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వల్లీదేవిని వివాహం చేసుకోవడానికి బోయకుల రాజులతో చిన్నపోరు చేసి, శాంతించి, ఈ క్షేత్రంలో కొలు వయ్యాడని స్థలపురాణం చెబుతోంది. స్వామి శాంతించి కొలువయ్యాడు కాబట్టి ఈ క్షేత్రానికి ‘తణిగై’ అంటే ‘శాంతిపురి’ అనే పేరొచ్చిందం టారు. ‘తణిగ’ అంటే మన్నించుట, ఓదార్చుట అనే అర్థాలున్నాయి. స్వామి తన భక్తుల పాపాలను మన్నించి కటాక్షిస్తాడు కాబట్టి ఈ క్షేత్రానికి ‘తిరుత్తణి’ అనే పేరొచ్చింది. కొండపైకి వెళ్లడానికి మెట్ల మార్గం ఉంది. ఉచిత బస్సు సౌకర్యం ఉంది. 365 మెట్లను ఏడాదిలో 365 రోజులకు ప్రతీకలుగా చెబుతారు.
