
హిరణ్యకశ్యపుడు, ప్రహ్లాదుని కథ గురించి మనకు తెలిసిందే. వారిద్దరూ తండ్రీకుమారులు. ప్రహ్లాదునికి భగవంతుడంటే వల్లమాలిన భక్తి. హిరణ్యకశ్యపుడికి అహంకారంతో కళ్లు మూసుకుపోయి తానే అంతా అన్నట్టుగా ప్రవర్తిస్తుంటాడు. తనను మానవ మాత్రులెవరూ చంపలేరన్న అహంకారంతో దేవతలందరినీ వేధిస్తుంటాడు. దీంతో విష్ణుమూర్తి సగం మనిషి, సగం జంతువుగా మారి నరసింహావతారంతో హిరణ్యకశ్యపుడిని సంహరించాడు. ఆయన ఉగ్ర రూపాన్ని శాంతింపజేయడానికి వెయ్యి నూతులలో నీటిని తీసుకొచ్చి ఆయనపై పోశారని చెబుతారు. మరి ఆ ప్రదేశం ఎక్కడుందో తెలుసా?
ఏపీలోని అహోబిలంలో నరసింహస్వామివారి క్షేత్రం ఉంది. ఇది హిరణ్యకశ్యపుడిని సంహరించిన ప్రదేశం అయితే కాదు కానీ హిరణ్యకశ్యప సంహారం అనంతరం స్వామివారు ఇక్కడికి వచ్చారట. అప్పుడు కడప జిల్లా లోని కమలాపురం నియోజకవర్గం పెండ్లి మర్రి ప్రాంతంలోని వెయ్యి నూతుల కోన ప్రాంతం ఉంది. ఇక్కడి నుంచే స్వామివారికి నీటిని తెచ్చి అభిషేకం చేశారట. నరసింహా స్వామి వారు హిరణ్యకశిపుడిని వధించి కొండప్రాంతం అయిన ఈ క్షేత్రానికి రాగా ఆయన ఉగ్రరూపాన్ని చల్లార్చడం కోసం దేవతలు కొండ పరిసర ప్రాంతంలో వెయ్యి బావులను సృష్టించి వాటిలోని నీటిని తెచ్చి అభిషేకించారట. అప్పుడు కానీ నరసింహస్వామి చల్లబడలేదట. ఇక్కడి స్వామివారిని దర్శించుకుంటే ఏం అనుకుంటే అది జరుగుతుందట.
