తిరుచెందూర్‌లోని సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం గురించి ఇప్పటికే చాలా విషయాలు తెలుసుకున్నాం. ఈ క్రమంలోనే స్వామివారి మహత్య్సం గురించి కూడా తెలుసుకుందాం. తమిళనాడులోని తూత్తుక్కుడి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో తిరుచెందూర్‌లో సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయాన్ని సముద్రం ఒడ్డున నిర్మించారు. అయితే ఈ ఆలయాన్ని దేశికా మూర్తి అనే వ్యక్తి నిర్మించాడని చెబుతారు. దేశికామూర్తి చాలా పేదవాడట. ఆలయాన్ని నిర్మించేందుకు వచ్చిన కూలీలకు డబ్బులు ఇవ్వలేక బదులుగా స్వామివారి విభూది ఇచ్చేవాడట. కూలీలు దానిని తీసుకుని కొంత దూరం వెల్లగానే విభూది కాస్త బంగారు నాణేలుగా మారిపోయేదట.
ఇది తెలుసుకున్న ప్రజలు అదంతా సుబ్రహ్మణ్య స్వామివారి మహిమేనని నమ్మి స్వచ్ఛందంగా వచ్చి ఆలయ నిర్మాణంలో పాలు పంచుకుని గోపుర నిర్మాణం పూర్తి చేశారట. నాటి నుంచి కూడా ఇక్కడి స్వామివారి విభూదిని అత్యంత మహిమాన్వితమైనదిగానే చూస్తారు. దీనిని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుని నిత్యం నుదుటన ధరిస్తే ఆపదలు, అనారోగ్య సమస్యలన్నీ మాయమవుతాయట. ముఖ్యంగా అభిషేకం చేసిన విభూతి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే.. ఇంట్లో ఎలాంటి గ్రహ, శత్రు, భూత, ప్రేత, పిశాచ బాధలున్నా తొలగిపోతాయట. అలాగే దీర్ఘకాలిక చర్మ వ్యాధులు సైతం నయమవుతాయట.