
శ్రీరాముడు మానవ జన్మ ఎత్తాడని చెబుతారు. మరి అలాంటప్పుడు మానవుడైన రామయ్యను ఎందుకు పూజించాలి? ఏంటాయన ప్రత్యేకత? అంటే ఆయనలోని సద్గుణాలే ఆయనను భగవంతుడిని చేశాయి. పదిహేను సంవత్సరాల ప్రాయంలోనే ఘోరరాక్షసి తాటకి ప్రాణాలను వైతరిణి దాటించాడు. శివధనుస్సును అవలీలగా ఎక్కుబెట్టి అతివ సీతను గెలుచుకున్నాడు. భార్యాభర్తల అనురాగానికి ఈ రోజుకు కూడా వారే నిర్వచనం. అర్ధరూపాయి ఆస్థికోసం కన్నతండ్రిని అడ్డంగా నరికే అధములున్న ఈ సృష్టిలో… ఇంకాసేపట్లో పట్టాభిషేకము, చక్రవర్తి కాబోతున్నాడు. అంతలోనే అడవులకు పొమ్మని తండ్రి ఆదేశమును ఏమాత్రం ధిక్కరించకుండా వెళ్లిపోయాడు.
తన ప్రియమిత్రుడు, ఆత్మసమోసఖా! ఆత్మసఖుడయిన గుహుడిని ఆప్యాయంగా కౌగలించుకొని ఆదరంగా పలకరించి మౌనంగా గంగ దాటాడు!.. ఈ గుహుడు ఒక నిషాదుడు .. రాముడి ఆత్మ. అన్నా! నీకన్నా రాజ్యం నాకు ఏపాటిది! నేను నీకు సేవకుడిని అని తమ్ముడు భరతుడు కన్నీటితో పాదాలు కడిగి ప్రార్దించినా, పూవులలోపెట్టి రాజ్యాన్ని తిరిగి అప్పగించినా, తండ్రికి అనృతదోషము అంటకూడదని భరతుడి ప్రార్ధన తిరస్కరించాడు. అన్నదమ్ముల అనురాగానికి ఈ నాటికీ ఎవ్వరూ చేరుకోలేని శిఖరాలు ఆ నలుగురు. భార్య అపహరింపబడ్డ తరువాత అంత దుఃఖాన్ని దిగమింగి జటాయువుకు దహన సంస్కారాలు చేసి పశు పక్ష్యాదులు కూడ మనలాంటి ప్రాణులే అని లోకానికి సందేశమిచ్చాడు. మహారాజునన్న గర్వం కించిత్తు లేదు. పర స్త్రీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే రాముడి సుగుణాలెన్నో. అందుకే ఆయన ప్రపంచానికి ఆదర్శప్రాయుడయ్యాడు.
