దుర్గమ్మ చీరల వెనుక ఇంత కథ నడుస్తోందా?

బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం అవినీతికి అడ్డాగా మారిపోయింది. దీనిపై రోజుకో వివాదం వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. అమ్మవారి చీరల మాటున చాలా పెద్ద కథ నడుస్తోంది. అమ్మవారి చీరల ముసుగులో పెద్ద వ్యాపారమే నడుస్తోంది. అమ్మవారి ఆలయానికి దేశ వ్యాప్తంగా భక్తులు తరలి వస్తుంటారు. వచ్చినప్పుడు కొందరు భక్తులు అమ్మవారికి చీరను కానుకగా సమర్పిస్తూ ఉంటారు. అమ్మవారికి ఆ చీరను ధరింపజేసిన అనంతరం వాటిని ఆలయంలోని శారీ విక్రయ కేంద్రానికి పంపిస్తూ ఉంటారు.

ఇక ఈ విక్రయ కేంద్రంలోనే అసలు దందా షురూ అవుతుంది. అమ్మవారికి ధరింపజేసిన చీరను కొనుగోలు చేస్తే మంచిదని భక్తులు ఆ చీరను ఎంత ధర వెచ్చించైనా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇది ఎప్పుడూ జరుగుతూ ఉండే తతంగమే. అయితే నిబంధనలకు విరుద్ధంగా చీరలు అమ్మటమేకాకుండా.. ఏకంగా పెద్ద దందానే నడిపిస్తున్నారు. బయట మార్కెట్ నుంచి తెచ్చిన చీరలను అమ్మవారి చీరల కౌంటర్‌లో విక్రయానికి పెడుతున్నారు. అవి అమ్మవారికి ధరింపజేసిన చీరలేనని నమ్మబలుకుతున్నారు. దీంతో భక్తులు వారు ఎంత చెబితే అంత పెట్టి కొనుగోలు చేస్తున్నారు. ఆలయానికి భారీగా నష్టం వచ్చిందంటూ ఫిర్యాదులు అందడంతో అధికారులు విచారణ జరిపారు. ఆ విచారణలో ఈ దందా కూడా బట్టబయలైంది.

Share this post with your friends