తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకి సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

తిరుమలలో అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకూ జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్రీ జె. శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ఆహ్వానించారు. ఆదివారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వచ్చిన టీటీడీ ఈవో, అదనపు ఈవో ఆయనకు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులలో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు, వేదపండితులు గౌరవ ముఖ్యమంత్రికి వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆయనకు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందించారు.

ఇక తిరుమలలో యాత్రికుల రద్దీ బాగా తగ్గింది. ఇవాళ కంపార్ట్‌మెంట్లలో ఎక్కడా వేచి ఉండే పని లేకుండా నేరుగా శ్రీవారి దర్శనానికి పంపిస్తున్నారు. టోకెన్లు లేని వారికి శ్రీ మలయప్ప స్వామివారి దర్శనానికి కేవలం 2 గంటల సమయం మాత్రమే పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనమైతే గంటలో పూర్తవుతోంది. ఆదివారం స్వామి వారిని 82,436 మంది దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 25,437 మంది శ్రీ వేంకటేశ్వరునికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.57 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.

Share this post with your friends