ఈ అమ్మవారిని శుక్రవారం దర్శించుకున్నారో ఎలాంటి పనైనా ఇట్టే పూర్తవుతుందట…

ఒక్కో వారం ఒక్కో దేవతకు అంకితం. శుక్రవారం వచ్చేసి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. అయితే ఓ అమ్మవారిని శుక్రవారం దర్శించుకుంటే జీవితమే మారిపోతుందట. కర్ణాటకలో ఎన్నో ప్రాచీన ఆలయాలున్నాయి. వాటిలో హోస్పేట సమీపంలో ఉన్న విజయలక్ష్మి ఆలయం చాలా మహిమాన్వితమైన ఆలయం. పంపా సరోవరం గట్టుపై వెలసిందీ అమ్మవారు. విద్యారణ్యస్వామి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ముందు పుష్కరకాలం పాటు పంపా సరోవర తీరంలో తపస్సు చేశారట. ఈ క్రమంలోనే ప్రతిరోజూ ఆయన కనకధారాస్తవనం చేసేవారట. దీనికి ముగ్ధురాలైన అమ్మవారు ప్రత్యక్షమై కనక వర్షం కురిపించిందట. అమ్మవారు ప్రత్యక్షమైన ప్రాంతంలోనే విద్యారణ్యస్వామి ఆలయాన్ని నిర్మించారని స్థల పురాణం చెబుతోంది.

విద్యారణ్య స్వామి నిర్మించిన ఆలయంలోని అమ్మవారు విజయలక్ష్మిగా పూజలు అందుకుంటోంది. ఇక ఈ ఆలయ పరిసరాలు చూడటానికి కూడా అద్భుతంగా ఉంటాయి. పచ్చని ప్రకృతి నడుమ మనకు కొన్ని ఆలయాలు మాత్రమే కనిపిస్తాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి విజయలక్ష్మి అమ్మవారి ఆలయం. గర్భాలయంలో అమ్మవారిని ఎంత చూసినా తనివి తీరదు. అంత అద్భుతంగా ఉంటుంది. ఈ అమ్మవారి పేరులోని విజయం ఉంది కదా.. ఈమెను దర్శించుకుంటే ఎలాంటి పని అయినా ఇట్టే పూర్తవుతుందట. ముఖ్యంగా అమ్మవారిని శుక్రవారం దర్శించుకుంటే ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదనుకున్న పనులు సైతం నెరవేరుతాయట.

Share this post with your friends