ఈ ఆలయంలో అమ్మవారి కంటే ఎక్కువగా వేటిని పూజిస్తారో తెలిస్తే..

కొన్ని ఆలయాలు చాలా ప్రత్యేకం. ఆలయంలో కొలువైన దేవత కంటే.. అక్కడుంటే పశుపక్షాదులకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి ఆలయమే రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలోని దేశ్నోక్‌లో ఉంది. దీనిని కర్ణి మాత ఆలయం అని పిలుస్తారు. ఈ ఆలయం ఎలుకలకు ప్రసిద్ధి గాంచింది. వాస్తవానికి ఇక్కడ ప్రధాన దైవం దుర్గాదేవి అవతారంగా భావించే కర్ణి మాత. కానీ ఇక్కడకు వచ్చినవారు ఎలుకలకు ప్రాధాన్యమిస్తారు. ఇక్కడ భారీ సంఖ్యలో కాబాగా పిలువబడే నల్ల ఎలుకలు ఉంటాయి. అవి బహిరంగంగానే తిరుగుతుంటాయి.

ఇక ఈ ఆలయానికి వచ్చిన భక్తులంతా ఈ నల్ల ఎలుకలకు ప్రసాదం పెడతారు. అవి ప్రసాదాన్ని తాకినా.. లేదంటే తిన్నా కూడా చాలా మంచిదని భావిస్తారు. ఎలుక తినగా మిగిలిపోయిన ఆహారాన్ని భక్తులు మహా ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇక్కడున్న ఎలుకలు సాధారణ జీవులు కావని.. కర్ణి మాత వారసులు, అనుచరులకు పునర్జన్మలని ఇక్కడి వారి నమ్మకం. ఈ ఆలయంలో అరుదుగా తెల్ల ఎలుకలు కూడా కొన్ని సమయాల్లో కనిపిస్తుంటాయి. వాటిని కర్ణి మాతకు చిహ్నంగా భావిస్తూ ఉంటారు. అవి కానీ దర్శనమిచ్చాయంటే ఏకంగా కర్ణిమాత దర్శనమిచ్చినట్టే భక్తులు భావిస్తారు.

Share this post with your friends