హిందూమతంలో దేవాలయానికి వెళ్లి మొక్కుకోవడం.. కోరిన కోరికలు తీరిన అనంతరం భగవంతుడికి మొక్కు తీర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. మొక్కుగా ఏదో ఒకటి చేస్తాం. కొన్ని ఆలయాల్లో ప్రదక్షిణలు.. మరికొన్ని ఆలయాల్లో స్వామివారికి ఏదో ఒక వస్తువు సమర్పించడం వంటివి చేస్తాం. ఇక కొన్ని ఆలయాల్లో కొబ్బరికాయను ముడుపు కడతాం. కానీ ఓ ఆలయంలో స్వామివారికి గుమ్మడికాయను సమర్పిస్తే చాలు పొంగిపోయి మనం కోరిన కోరికలు నెరవేరుస్తాడట. మరి ఆ దేవుడు ఎవరు? ఆ ఆలయం ఎక్కడుందో తెలుసుకుందాం.
హనుమకొండ జిల్లాలోని కొత్తకొండలో వీరభద్ర స్వామి కొలువై ఉన్నాడు. ఆయనకు గుమ్మడికాయలే మహా నైవేద్యం. కోటీశ్వరులైనా… నిరుపేదలైనా.. స్థాయితో సంబంధం లేకుండా ఈ దేవుణ్ణి దర్శించుకోవాలంటే నెత్తిన గుమ్మడికాయ పెట్టుకుని రావాల్సిందే.. నైవేద్యంగా దానిని సమర్పించాల్సిందే. ఇక్కడ స్వామివారిని కోరిన కోరికలు నెరవేరితే చాలు.. గుమ్మడికాయను మొక్కు చెల్లిస్తారు. సామాన్యుల భక్తుల నుంచి సెలబ్రిటీలు, పెద్ద స్థాయిలో ఉన్న నేతల వరకూ రాచ గుమ్మడికాయ, చేతిలో కోర మీసాలతో తరలి వచ్చి వీరభద్రుడికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు.