తమిళనాడులోని కుంభకోణం సమీపంలో ఉన్న సూర్యనార్ కోవిల్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ ఆలయంలో సూర్యుడు ఇతర గ్రహాలతో కలిసి ఉన్నాడు. ఈ క్షేత్రానికి సంబంధించిన స్థలపురాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇక్కడ కాలవముని అనే యోగి కుష్టువ్యాధితో బాధపడేవాడట. తనకు తన వ్యాధి నుంచి విముక్తి కలిగించమని నిత్యం నవగ్రహాలను ప్రార్థిస్తూ ఉండేవాడట. అతని బాధను చూసి కరిగిపోయిన గ్రహాధిపతులు అతనికి ఆ వ్యాధి నుంచి విముక్తి కలిగించారు. విషయం తెలుసుకున్న బ్రహ్మ దేవుడు నవగ్రహాలపై ఆగ్రహం వ్యక్తం చేశాడట.
మానవుల్లో మంచి, చెడులకు సంబంధించిన ఫలితాలను ఇవ్వడమే గ్రహాల పని అని.. వారికి వ్యాధుల నుంచి విముక్తి కలిగించడం కాదని బ్రహ్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమ పరిధిని అతిక్రమించిన గ్రహాలను భూలోకంలోని శ్వేత పుష్పాల అటవీప్రాంతానికి వెళ్లిపొమ్మని బ్రహ్మ శపించాడు. దీంతో భూలోకానికి వచ్చిన నవగ్రహాలు లయకారకుడైన పరమేశ్వరుని కోసం తపస్సు చేయగా.. వారికి మహాశివుడు శాపవిముక్తి కలిగించాడు. వారు ఎక్కడైతే తనను పూజించారో అక్కడ వారికి మహాశక్తులను ప్రసాదించి ఏదైనా బాధతో ఈ క్షేత్రానికి వచ్చే వారికి వారి బాధలను తీర్చమని చెప్పాడు. అప్పటి నుంచి ఈ నవగ్రహాలను ఎవరైతే తమ బాధ తీర్చమని వేడుకుంటారో వారికి ఉపశమనం కలిగిస్తున్నారని ప్రతీతి.