కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల క్షేత్రానికి ఉన్నంత విశిష్టత దేశంలో మరే క్షేత్రానికి లేదు. కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడిగా శ్రీ మలయప్ప స్వామివారు పూజలు అందుకుంటున్నారు. శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. అయితే కొంతమంది తమ కోరికలు తీరాలని స్వామివారికి ముడుపు కడుతుంటారు. కోరిక తీరిన అనంతరం ముడుపును జాగ్రత్తగా తీసుకెళ్లి స్వామివారికి సమర్పిస్తారు. అయితే ముడుపు కట్టడంలోనూ కొన్ని నియమాలుంటాయి. వాటిని అనుసరిస్తూ కడితేనే ఫలితం మరింత బాగుంటుంది. మరి ఆ ముడుపును ఎలా కట్టాలో చూద్దాం.
ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని దేవుడి దగ్గర దీపారాధన చేసి వినాయకుడికి ముందుగా కోరికను విన్నవించుకోవాలి. ఆ తరువాత శ్రీవారికి ముడుపు కట్టాలి. ముందుగా ఓ గిన్నెలో కొద్దిగా పసుపు, గంధం, పచ్చ కర్పూరం వేసి ఆ తరువాత నీరు పోసి కలుపుకోవాలి. అనంతరం తెల్లటి వస్త్రాన్ని ఆ నీటిలో ముంచి కొద్దిసేపటి తర్వాత నీటిని పిండి ఆరేయాలి. ఆరిన తర్వాత ఆ వస్త్రాన్ని తీసుకుని నాలుగు మూలల, వస్త్రం మధ్యలో కుంకమ బొట్లు పెట్టి అనంతరం వేంకటేశ్వర స్వామి తిరునామాన్ని తీర్చిదిద్దాలి. ఆ వస్త్రాన్ని ఓ పీటపై పరిచి దానిలో 7 ఎండు ఖర్జూరాలు.. 7 యాలకులు, 7 లవంగాలు, కొద్దిగా పచ్చ కర్పూరం, పసుపు, కుంకుమ, అక్షింతలు, 11 లేదా 21 లేదా 54 లేదా 108 లేదా 111 లేదా 116 లేదా 516 రూపాయి నాణేలు వేయాలి. అనంతరం వస్త్రాన్ని మూట కడుతూ మనసులోని కోరిక చెప్పుకోవాలి. ఆ తర్వాత ఆ మూట మీద పసుపు, కుంకుమ, గంధం బొట్లు పెట్టి.. వేంకటేశ్వర స్వామి తిరునామాన్ని కుంకుమతో తీర్చిదిద్దాలి. ఇక ఆ ముడుపును మన కోరిక నెరవేరే వరకూ స్వామివారి చిత్ర పటం వద్ద ఉంచి కోరిక తీరిన అనంతరం తిరుమల హుండీలో వేయాలి.