వినాయకుడి పూజలో వాడే పత్రి మనకు ఎలా మేలు చేస్తుందంటే..

వినాయక చవితి నాడు వినాయకుడి పూజలో మనం 21 రకాల పత్రిని వాడుతామని తెలుసుకున్నాం. వాటిలో చాలా ఔషధ గుణాలున్నాయి. ఆ 21 రకాల పత్రి ఏంటి? అవి మనకు జీవితంలో ఎలా ఉపయోగపడతాయో చూద్దాం.

దూర్వార పత్రం (గరిక): వినాయకుని పూజకు గరిక అత్యంత శ్రేష్టం. తెల్ల గరిక, నల్ల గరిక అని రెండు రకాలుంటాయి. మన శరీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే గుణాలు గ‌రిక‌లో ఉన్నాయి. గ్రహణ సమయంలో వెలువడే విషాన్ని సైతం అడ్డుకోగల శక్తి గరికకి ఉంది.

మాచీ పత్రం: వినాయకుని పూజలో మాచీ పత్రం వాడుతాం. చేమంతి జాతికి చెందిన దీని ఆకులు సువాసనా భరితంగా ఉంటాయి. ఈ మాచిపత్రాన్ని వాస‌న చూస్తే ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గి మాన‌సిక ఉల్లాసం క‌లుగుతుంది.

అపామార్గ పత్రం (ఉత్తరేణి): వినాయకుని పూజలో వాడే అపామార్గ పత్రాన్ని ఉత్తరేణి అని కూడా పిలుస్తారు. దీని ఆకులు గుండ్రంగా వుంటాయి. గింజలు, ముళ్ళు కలిగి వుంటాయి. ద‌గ్గు, ఆస్తమా స‌మ‌స్యల‌ను నివారించడంలో సమర్ధవంతంగా ప‌నిచేస్తాయి.

బిల్వ పత్రం (మారేడు): వినాయకుని పూజలో వాడే బిల్వ పత్రం గురించి తెలియని వారుండరు. శివుడికి కూడా అత్యంత ఇష్టమైన పత్రం. షుగ‌ర్ వ్యాధి ఉన్నవారికి మారేడు మంచి ఔషధం. విరేచ‌నాలను తగ్గించడంలోనూ ఉపయోగపడుతుంది.

బృహతీ పత్రం (ములక): బృహతి పత్రం అంటే “వాకుడాకు”. దీనిని ములక అని కూడా అంటారు. ఈ బృహతీ పత్రం శ్వాస కోశ స‌మ‌స్యల‌ను న‌యం చేస్తుంది. ముఖ్యంగా ఉబ్బసం ఉన్న వారికి ఈ ఆకు ఔషధంలా పని చేస్తుంది.

తులసీ పత్రం( తులసి): తులసి పత్రం గురించి అందరికీ తెలుసు. దీనిలో ఔషధాలు చాలా ఉన్నాయి. శరీరంలో వేడిని తగ్గించడంలోనూ.. శ్వాసకోశ సమస్యలను నివారించడంలో తుల‌సి దివ్యౌషధంగా పనిచేస్తుంది.

దత్తూర పత్రం (ఉమ్మెత్త) : వినాయకుని పూజలో వాడే దత్తూర పత్రాన్ని ఉమ్మెత్త అని కూడా అంటారు. ఇది వంకాయ జాతికి చెందింది. దీనికి వంకాయ రంగు పూలు ఉంటాయి. ఉమ్మెత్త శ్వాస‌కోశ వ్యాధుల‌ను, ముఖ్యంగా ఆస్తమాను న‌యం చేస్తుంది.

బదరీ పత్రం (రేగు): రేగు చెట్టు ఆకులు చర్మ సమస్యలను తొలగిస్తాయి.

చూత పత్రం (మామిడి): మామిడి గురించి తెలియని వారెవరుంటారు? మామిడి ఆకులను నమిలితే.. నోటి దుర్వాసన, చిగుళ్ల వాపు తగ్గుతుంది.

కరవీర పత్రం (గన్నేరు): గన్నేరు పత్రాన్ని చూర్ణంగా చేసి శరీరంపై ఉన్న గ‌డ్డలు, గాయాలపై పూతగా రాస్తే మంచి ఫలితం ఉంటుంది.

మరువక పత్రం (ధవనం, మరువం): ఈ ఆకులు మంచి సువాస‌న‌ను వెద‌జ‌ల్లుతాయి. వీటి వాస‌న చూస్తే చాలు.. ఒత్తిడి అంతా మాయమవుతుంది.

శమీ పత్రం (జమ్మి): శమీ పత్రం అంటే జమ్మి ఆకులు. శమీ చెట్టుకు దసరా రోజున తప్పక పూజిస్తారు. శమీ ఆకులు నోటి సంబంధ వ్యాధుల‌ను తగ్గిస్తాయి.

విష్ణుక్రాంత పత్రం: విష్ణుక్రాంత పత్రం సౌందర్యాన్ని పెంపొందించడంలో అద్భుతంగా పని చేస్తుంది. ఈ ఆకుల‌తో చ‌ర్మ సౌంద‌ర్యం పెరుగుతుంది.

సింధువార పత్రం (వావిలాకు): వావిలాకు కీళ్ల నొప్పుల స‌మ‌స్యను తగ్గిస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. ప్రసవానంతరం మహిళలకు వేడినీటిలో ఈ ఆకును వేసి స్నానం చేయిస్తారు. కీళ్లనొప్పులు ఉన్నవారు ఈ ఆకును చూర్ణం చేసి నొప్పి ఉన్న చోట వాడితే నొప్పులు తగ్గిపోతాయి.

అశ్వత్థ పత్రం (రావి): రావి చెట్టులో సకల దేవతలుంటారని ప్రతీతి. రావి ఆకులు చ‌ర్మ స‌మ‌స్యలు వారికి మంచి ఔషధం.

దాడిమీ పత్రం (దానిమ్మ): దానిమ్మ చెట్టు ఆకులు వాంతులు, విరేచ‌నాల‌ను అరికడతాయి.

జాజి పత్రం (జాజిమల్లి): జాజి పత్రం అంటే సన్నజాజి ఆకులు చ‌ర్మ స‌మ‌స్యలు, స్త్రీ సంబంధ వ్యాధుల‌ను తగ్గిస్తుంది.

అర్జున పత్రం (మద్ది): అర్జున పత్రం అంటే మద్ది ఆకులు గుండె సమస్యలను దూరం చేయడమే కాకుండా గుండె ఆరోగ్యానికి, ర‌క్తం సరఫరా అయ్యేందుకు ఉపయోగపడుతుంది.

దేవదారు పత్రం: దేవదారు పత్రం శ‌రీరంలో వేడిని తగ్గించి ఆక్సిజన్‌ను ఎక్కువగా సరఫరా చేస్తుంది కాబట్టి దీని వాసన చూస్తే ఒత్తిడి తగ్గుతుంది.

గండలీ పత్రం (లతాదూర్వా): గండలీ పత్రం అంటే లతాదూర్వా పత్రాలు అతిమూత్ర స‌మ‌స్యను చక్కగా తగ్గిస్తుంది.

అర్క పత్రం (జిల్లేడు): జిల్లేడు ఆకు న‌రాల బ‌ల‌హీన‌త‌, చ‌ర్మ స‌మ‌స్యలు తగ్గిస్తాయి.

Share this post with your friends