హిందువులు తమ ఇళ్ల ముందు తులసి మొక్కలను పెంచడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. నిత్యం తులసి మొక్కను పూజించుకున్న తర్వాతే దినచర్యను ప్రారంభిస్తూ ఉంటారు. ఇక తులసిలో చాలా రకాలు ఉన్నాయి. వాస్తవానికి ముదురాకు ఆకుపచ్చ రంగుతో ఉండే శ్యామ తులసిని ఇంటి ముందు నాటి మనం పూజిస్తూ ఉంటాం. తులసిలో మన ఆరోగ్యానికి సహకరించే చాలా గుణాలు ఉన్నాయి. తులసి మన రోగ నిరోధక శక్తికి, జీర్ణ వ్యవస్థను మెరుగు పరిచేందుకు.. చర్మం, జుట్టు పటిష్టతకు మరెన్నో రకాలుగా మనకు సహాయపడుతుంది. ఇక తులసిలోని రకాలను తెలుసుకుందాం.
శ్యామ తులసి: దీనిని కృష్ణ తులసి అని కూడా పిలుస్తారు. కన్నయ్యకు చాలా ఇష్టమైన తులసి మొక్క కాబట్టి దీనిని శ్యామ తులసి అని పిలుస్తారు.
రామ తులసి: దీనికి శ్రీ తులసి, లక్కీ తులసి, ఉజ్వల తులసి అనే పేర్లు కూడా ఉన్నాయి. దీని ఆకులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ముఖ్యంగా దీనిని పూజకు వినియోగిస్తారు. కాబట్టి చాలా మంది దీనిని నాటి పూజ చేస్తారు.
విష్ణు తులసి: దీనికి తెల్ల పువ్వులు పూస్తుంటాయి. దీనిని చాలా అరుదుగా పెంచుతారు. .
అడవి తులసి: ఇది అడవుల్లో మాత్రమే కనిపిస్తుంది. పెద్ద ఆకులతో ఉండే దీనికి మత పరమైన ప్రాముఖ్యత కానీ.. పూజలో వినియోగించడం కానీ జరగదు. అద్భుతమైన ఔషధంగా ఇది పని చేస్తుంది.
ఆఫ్రికన్ తులసి: కేవలం ఆఫ్రికాలో మాత్రమే కనిపిస్తుంది. దీని ఆకులు కూడా అడవి తులసి మాదిరిగానే పెద్దగా ఉంటాయి. దీనిని కూడా పూజలో వినియోగించరు. ఔషధాల కోసం మాత్రమే వినియోగిస్తారు.
నిమ్మ తులసి: ఈ తులసి ఆకులు నీలం రంగులో ఉంటాయి. దీని ఆకులు చాలా పుల్లగా ఉంటాయి. ఈ తులసిని టీ తయారీలో, ఆహార నాణ్యతను నిర్వహించడానికి మాత్రమే ఉపయోగిస్తారు.