
స్వర్గ లోకాధిపతి అయిన ఇంద్రుడికి ఒళ్లంతా కళ్లే. నిత్యం భోగములలో మునిగి ఉంటాడని ఇంద్రుడి గురించి చెబుతారు. దీనికి సంబంధించి ఒక కథ కూడా ఉంది. అదేంటంటే.. ఇంద్రుడి శరీరంపై కళ్లు గౌతమ మహర్షి శాపం వల్ల వచ్చాయట. వాస్తవానికి అవి యోనిలని.. ఆ తరువాత అవి కళ్లుగా మారాయట. బ్రహ్మవైవర్త పురాణం, పద్మ పురాణం రెండింటిలోనూ దీనికి సంబంధించిన ప్రస్తావన ఉంది. గౌతమి మహర్షి భార్య అహల్యకు శాశ్వత యవ్వనంగా ఉండే వరం లభించింది. ఆమె అపురూప సౌందర్యరాశి. ఒకసారి ఇంద్రుడు భూమిపై పర్యటనకు వచ్చినప్పుడు అహల్యను చూసి ఆకర్షితుడయ్యాడు. ఆ తరువాత ఆమె గైతమ మహర్షి భార్య అని తెలుసుకున్నాడు.
పక్కా ప్రణాళికతో తెల్లవారినట్టుగా వాతావరణాన్ని మార్చేసి కోడి కూత గౌతమ మహర్షికి వినబడేలా చేశాడు. తెల్లవారిందనుకున్న గౌతముడు నదీ స్నానానికి వెళ్లాడు. అక్కడికి వెళ్లాక ఆయన తెల్లవారలేదని అర్థమైంది. వెంటనే తన నివాసానికి వచ్చిన గౌతముడికి అహల్య, ఇంద్రుడు కలిసి ఉండటం కనిపించింది. ఆగ్రహంతో గౌతముడు.. అహల్యను శిలగా మారిపొమ్మని శపించాడు. ఇంద్రుడిని ఏ యోని కోసం ధర్మాన్ని వదిలావో.. ఆ యోని నీ ఒల్లంతా నిండిపోవాలని శపించాడు. దీంతో ఇంద్రుడి ఒళ్లంతా వెయ్యి యోనిలతో నిండిపోయింది. అప్పుడు ఇంద్రుడు తన చేసిన తప్పుకి క్షమించమని వేడుకున్నా గౌతముడు కరుణించలేదు. దీంతో సూర్యుడి గురించి తపస్సు చేసి శాప విముక్తి కలిగించాలని కోరగా.. శాపాన్ని అయితే నివారించలేను కానీ యోనిని మాత్రం కళ్లుగా మార్చగలనని చెప్పాడట. అలా ఇంద్రుడి శరీరంపై యోనిలన్నీ కళ్లుగా మారాయని చెబుతారు.
