హనుమంతుడు.. పంచముఖ ఆంజనేయుడిగా ఎందుకు మారాల్సి వచ్చిందంటే..

అంజనీసుతుడు ఆంజనేయుడు పంచముఖుడిగా ఎలా మారాడనే దానికి ఓ కథ ఉంది. అదేంటో తెలుసుకుందాం. రామలక్ష్మణులను రక్షించేందుకు హనుమంతుడు పంచముఖుడిగా మారాడట. రావణుడు సీతను అపహరించిన తర్వాత హనుమంతుడు ఆమె జాడ తెలుసుకుని రామయ్యకు చెబుతాడు. రావణ రాజ్యంపైకి రాముడు దండెత్తుతాడు. రాముడిని సాధారణ మానవుడిగా భావించిన రావణుడికి కొద్ది రోజుల్లోనే రాముడి గురించి తెలుస్తుంది. రావణుడి సేన రోజు రోజుకూ తగ్గిపోవడం ఆయనను కలవరపెడుతుంది. చివరకు తన కుమారుడు ఇంద్రజిత్తు సైతం మరణించడంతో ఆవేదన చెందుతాడు. ఈ క్రమంలోనే పాతాళ లోకానికి అధిపతి అయిన మైరావణుని సాయం కోరుతాడు. అప్పుడు మైరావణుడు వచ్చి హనుమంతుడిని ఏమార్చి రామలక్ష్మణులను అపహరించుకుపోతాడు. వారిని పాతాళ లోకానికి తీసుకెళతాడు.

విషయం తెలుసుకున్న హనుమంతుడు రామలక్ష్మణుల కోసం పాతాళ లోకానికి వెళ్లి మైరావణ రాజ్యానికి రక్షణగా ఉన్న మకరధ్వజునితో యుద్ధం చేస్తాడు. ఆ సమయంలోనే మకర ధ్వజుడు తన కుమారుడని హనుమంతుడు తెలుసుకుంటాడు. అయినా సరే.. ఏమాత్రం వెనుకాడకుండా మకరధ్వజుడితో యుద్ధం చేసి పై చేయి సాధిస్తాడు. అయితే మైరావణుడిని సంహరించాలంటే మైరావణపురంలో ఐదు దిక్కుల్లో వెలుగుతున్న దీపాలను ఏకకాలంలో ఆర్పితేనే సాధ్యమవుతుంది. ఈ విషయం తెలుసుకున్న ఆంజనేయుడు తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఊర్ధ్వముఖ ఇలా అయిదు దిక్కులా అయిదు ముఖాలను ధరించి ఆ దీపాలను ఒక్కసారిగా అర్పేస్తాడు. అనంతరం పంచముఖాలతోపాటు ఏర్పడిన పది చేతులతో మైరావణుని అంతం చేస్తాడు. అప్పటి నుంచి ఆంజనేయుడు పంచముఖాంజనేయుడిగా పూజలందుకుంటున్నాడు.

Share this post with your friends