హనుమజ్జయంతి రెండు కాదు.. మూడు సార్లు.. ఎలాగంటే..

హనుమజ్జయంతి ఏడాదిలో మూడుసార్లు వస్తుంది. ఎలా అంటే, ఒక్కో ప్రాంతవాసులు ఒక్కోసారి జరుపుకుంటారు. కొందరు చైత్ర పౌర్ణమినాడు జరుపుకుంటే.. మరికొందరు వైశాఖమాసం దశమినాడు హనుమజ్జయంతి జరుపుతారు. ఇక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మార్గశిర మాసంలో హనుమజ్జయంతి జరుపుకుంటారు. పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి , శనివారం జన్మించాడు. అదే రోజున హనుమంతుని జన్మ తిథి చేసుకోవాలని చెబుతారు. వాయుపుత్రుడైన హనుమంతుడు గాల్లో పయనించ గలడు. పర్వతాన్ని ఎత్తి, చేత్తో పట్టుకోగలడు. భూత ప్రేత పిశాచాల్లాంటి క్షుద్రశక్తులను తరిమికొట్టగలడు. శ్రీరాముని నమ్మినబంటు అయిన హనుమంతుడు బలానికి, ధైర్యానికి ప్రతిరూపం. హనుమంతుని ఆరాధించడంవల్ల ధైర్యం,స్థైర్యం కలుగుతాయి.

భయాలూ భ్రమలూ పోతాయి. చింతలు, చిరాకులు తీరతాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరి, కీర్తిప్రతిష్టలు వస్తాయి. నిత్యం హనుమంతుని నామస్మరణ చేసేవారికి ఎలాంటి ఆందోళనా దరిచేరదు. సదా ఆనందంగా ఉంటారు.
హనుమజ్జయంతి విశేష దినాన మరింత భక్తిశ్రద్దలతో హనుమంతుని పూజించాలి. ఆంజనేయుడు అంజనాదేవి, కేసరిల పుత్రుడు. వాయుదేవుని ఔరస పుత్రుడు. మహాబలుడు, శ్రీరామదాసుడు, అర్జునుని సఖుడు, ఎఱ్ఱని కన్నులు కల వానరుడు, అమిత విక్రముడు, శతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు. లంకలో బందీయైన సీతమ్మతల్లి శోకాన్ని హరించినవాడు, ఔషధీ సమేతంగా ద్రోణాచలం మోసుకుని వచ్చిన యుద్ధంలో వివశుడైన లక్ష్మణుని ప్రాణాలు నిలిపినవాడు. దశకంఠుడైన రావణాసురుని గర్వం అణచినవాడు. హనుమంతుని ఈ నామాలు నిద్రించడానికి ముందు, ప్రయాణానికి ముందు స్మరించినవారికి మృత్యుభయం లేదు. వారికి సర్వత్రా విజయం లభిస్తుంది. హనుమతుడికి 5 సంఖ్య చాలా ఇష్టం. కాబట్టి హనుమంతుడి ఆలయంలో 5 ప్రదక్షిణలు చేయండి.

Share this post with your friends