తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామివారు కల్ఫ వృక్ష వాహనంపై భక్తులకు కనువిందు చేశారు. నేటి రాత్రి స్వామివారు సర్వభూపాల వాహనంపై ఊరేగనున్నారు. ఇక శనివారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామివారు ముత్యపుపందిరి వాహనంపై భక్తులను కటాక్షించారు. రాత్రి 7 గంటలకు స్వామివారి వాహన సేవ ప్రారంభమైంది. నిత్య అలంకార ప్రియుడైన శ్రీవారు పూటకొక అలంకారంలో దేదీప్యమానంగా వెలిగిపోతుంటారు. ఆహ్లాదాన్ని కలిగించే ముత్యపుపందిరిపై భక్తులను చల్లగా ఆశీర్వదించారు.
జ్యోతిషశాస్త్రం ముత్యాన్ని చంద్రునికి ప్రతీకగా చెబుతోంది. సముద్రం మనకు ప్రసాదించిన మేలివస్తువులలో ముత్యం ఒకటి. చల్లని ముత్యాల కింద నిలిచిన స్వామివారి దర్శనం తాపత్రయాలను పోగొట్టి, భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూరుస్తుంది. వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, ఎఫ్ ఏ అండ్ సిఏఓ శ్రీ బాలాజీ, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఆగమ సలహాదారులు శ్రీ సీతారామాచార్యులు, శ్రీ మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్ శ్రీ నారాయణ, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రాధాకృష్ణ పాల్గొన్నారు.