మహాశివరాత్రి పవిత్ర వేళ “ఓం నమః శివాయ” మంత్ర నినాదాలతో మారుమోగే తెలుగు నేలలో…. ముక్తి ప్రసాదించే మహిమాన్విత క్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి పంచారామాలు. అమరావతిలో అమరేశ్వరుడిగా, ద్రాక్షారామంలో మాణిక్యాంబా సమేత భీమేశ్వరుడిగా, కుమార భీమేశ్వరుడు సామర్లకోటలో … పాలకొల్లులో రామలింగేశ్వరుడిగా…. భీమవరంలో సోమేశ్వరుడిగా పరమేశ్వరుడు భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. తారకాసురుని ఆత్మలింగం ఐదు భాగాలై…. భూమిపై ప్రతిష్ఠించబడినవే ఈ పంచారామాలన్నది పురాణ వచనం. అమరావతిలో అమరేశ్వరుడిని ఇంద్రుడు ప్రతిష్టించగా… ద్రాక్షారామంలో మహోన్నత లింగాన్ని సూర్య భగవానుడు… సామర్లకోటలో కుమార రామేశ్వరుడిని కుమారస్వామి…. పాలకొల్లులో రామలింగేశ్వరుడిని విష్ణుమూర్తి…. భీమవరంలో సోమేశ్వర లింగాన్ని చంద్రుడు ప్రతిష్టించారని స్థలపురాణం చెబుతుంది. ముఖ్యంగా సోమలింగం చంద్ర కళలకు అనుగుణంగా వర్ణం మారుతుంది. ఒకే రోజున ఈ ఐదు ఆరామాలను దర్శిస్తే పాపక్షయమై మోక్షసిద్ధి కలుగుతుందని శాస్త్రనిశ్చయం. భక్తి, విశ్వాసం, శివస్మరణ ఇవే ఈ యాత్ర సారాంశం. జన్మలో ఒక్కసారైనా పంచారామాల దర్శనం చేస్తే జీవితం ధన్యమవుతుంది.

