ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయం గురించి తెలిసిందే. అక్కడ లక్ష్మీనారాయణుడు కొలువై ఉన్నాడు. ఇక్కడ జరిగే కల్యాణోత్సవాలు ఆసక్తికంగా ఉంటాయి. హరిహరులిద్దరూ ఒకరిని విడిచి ఒకరుండలేదని.. కాబ్టటి వారికి పూజాధికాలన్నీ సరిసమానంగా అర్పించాలని ఈ కల్యాణోత్సవాలు చెబుతాయి. ఇక్కడ మాణిక్యాంబా సమేత భీమేశ్వరుడికీ, దయేశ్వరిని సమేత లక్ష్మీనారాయణుడికీ ఏటా మాఘ శుద్ధ ఏకాదశి రోజున ఒకే వేదికపై కల్యాణాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇలాంటి దృశ్యాన్ని ద్రాక్షారామంలో మాత్రమే దర్శించగలం. ఈ కల్యాణ మహోత్సవం అటు శైవ, వైష్ణవులిరువురికీ నేత్రపర్వంగా జరుగుతుంది.
భీమేశ్వరాలయంలో ఉపాలయాలు చాలా ఉన్నాయి. ఇక్కడికి వెళితే చతుర్ముఖ బ్రహ్మ సహా చాలా మంది దేవతామూర్తులను దర్శించుకోవచ్చు. ఆలయ ప్రాకారం చుట్టూ కాలభైరవుడు, ఢుండి గణపతి, విరూపాక్షుడు, నటరాజు, సప్తమాతృకలు, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, చతుర్మఖ బ్రహ్మ, లక్ష్మీ గణపతి, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, వీరభద్రుడు, సురేశ్వర చండీశ్వరాది దేవీదేవతామూర్తులూ కొలువుదీరి ఉంటారు. మరో విశేషమేంటంటే.. ఈ క్షేత్రంలో ప్రధాన ఆలయానికి తూర్పున అశ్వత్థనారాయణ వృక్షం ఉంటుంది. అది సంతానం లేని వారికి ఈ వృక్షం సంతాన భాగ్యాన్ని ప్రసాదిస్తుందట. అలాగే ఎవరైనా లౌకిక సమస్యలతో సతమతమవుతున్న వారు ఈ వృక్షాన్ని భక్తితో కొలిస్తే అవన్నీ మాయమవుతాయట.