కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దేశంలోనే రిచెస్ట్ గాడ్‌గా ఈయనకు పేరుంది. తిరుమలలో మలయప్ప స్వామి ఆలయానికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. అయితే స్వామివారి ఆలయానికి అయితే వెళతాం కానీ తిరుమలలో అయితే స్వామివారిని చూసేంత సమయం మనకుండదు. ముందుగా పరికించి ఆపాద మస్తకం చూడటం చాలా కష్టం. ఏదైనా ప్రత్యేక పూజల సమయంలో స్వామివారిని దర్శించుకున్నప్పుడు మాత్రమే మనకు ఆ అవకాశం లభిస్తుంది.
నిజానికి శ్రీ మలయప్ప స్వామివారి దివ్వ దర్శనం చేసుకున్న వారందరికీ దివ్యానుభూతి కలగటం ఖాయం. అయితే నిత్య కళ్యాణకారుడైన శ్రీ వేంకటేశ్వర స్వామివారి కరములు ఎప్పుడైనా గమనించారా? తిరుమలలోనే చూడాలని లేదు. ఎక్కడైనా సరే.. స్వామివారి చేతులు కిందకు నేలను చూపిస్తున్నట్టుగా ఉంటాయి. కనీసం చూసిన వారు ఇలా ఎందుకు ఉంటాయని తెలుసుకునే ప్రయత్నం చేశారా? శ్రీవారి చేతులు కిందకు చూపిస్తూ ఉండటం వెనుక కారణమేంటంటే.. స్వామి పాదాలను శరణన్న వారికి, దర్శించిన వారికి లోటు ఏమీ ఉండదని అర్థమట. ఈ విషయం మనకు శ్రీవెంకటేశ్వర సుప్రభాతంలో కూడా ఉంటుంది. కాబట్టి ఈసారి వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు వెళితే మాత్రం ఆయన చేతులను గమనించండి.