ఇప్పటికీ శివుడు ఆ మహారాజుకి ఏటా తద్దినం పెడతాడు.. అసలా కథేంటంటే..

అరుణాచల దేవాలయానికి ప్రధాన గోపురాన్ని వల్లాల మహారాజు నిర్మించారు. అందుకే ఇప్పటికి దానిని “వల్లాల గోపురం” అంటారు. ఆయనకు ఇద్దరు భార్యలు. వారికి సంతానం లేదు. సంతానం కోసం నిత్యం వల్లాల మహారాజు శివార్చన చేస్తుండేవాడు. చివరికి పరమేశ్వరుడి అనుగ్రహం కలిగింది. కానీ పరమేశ్వరుడు చిన్న పరీక్ష పెట్టాడు. తన ప్రథమ గణాలు అన్నింటినీ ఆ రాజ్యానికి పంపించాడు. వారంతా కళావంతుల ఇళ్ళకు వెళ్ళారు. వారి ఎదురుగా కళావంతులు నాట్యం చేస్తున్నారు. తరువాత మహారాజు వద్దకు శివుడు వచ్చాడు. శివుడిని చూసి ఎవరో శివభక్తుడిలా ఉన్నాడని రాజు ఆహ్వానించాడు. అప్పుడు శివుడు తాను కళావంతుల నాట్యం చూస్తాను అన్నాడు. రాజు కబురుచేస్తే ఒక్కరు కూడా ఖాళీగా లేరు. అందువలన ఎవరూ రాలేదు.

మహారాజు శివభక్తుడికి ఇచ్చిన మాట తప్పుతానని, చిన్న భార్యను పిలిచి “నీవు శివభక్తుడి వద్దకు వెళ్ళి నాట్యం చెయ్యి” అని ఆదేశించాడు. ఆమె వెళ్ళి నాట్యం చేయబోతే శివుడు వచ్చి స్పృశించాడు. వెంటనే శివుడు పసిపిల్లవాడిగా మారిపోయాడు. ఆవిడ ఆ పిల్లవాడిని ఎత్తుకొని ఆనందంతో భర్త వద్దకు వెళ్ళి ఇచ్చింది. అప్పుడు పిల్లవాడి రూపంలోనే శివుడు మాట్లాడాడు ఇలా… “రాజా! నీవు ఎందుకు కొడుకు కావాలన్నావో నాకు తెలుసు. రాజ్యానికి వారసుడి కోసం కాదు. నీవు చనిపోయాక అంత్యేష్టి సంస్కారం చెయ్యడానికి కొడుకు కావాలనుకున్నావు. నీకు వరం ఇస్తున్నాను. నీకు అంత్యేష్టి సంస్కారం, ప్రతీ సంవత్సరం తద్దినం నేనే పెడతాను” అన్నాడు. అలాగే రాజు శరీరం విడిచిపెట్టాకా అంత్యేష్టి సంస్కారం శివుడే చేసాడు. ఇప్పటికీ ప్రతి సంవత్సరం ‘పల్లికొట్టుకోట’ అనే ఊరికి పల్లకీలో “అరుణాచలేశ్వరుడు, అపితకుచాంబ” ఉత్సవ విగ్రహాలను తీసుకువెళ్ళి, బ్రాహ్మణులు తద్దిన మంత్రాలను చెప్పి, శివుడితో రాజుగారికి తద్దినం పెట్టిస్తారు.

Share this post with your friends