శాస్త్ర ప్రకారమే పూజించినా మంత్ర హీనం, క్రియా హీనం, భక్తి హీనం మంత్రమెందుకు పఠించాలి?

మనం ఏదైనా భగవంతునికి చక్కగా.. పద్ధతిగా పూజ చేసుకుంటాం. శాస్త్ర ప్రకారమే పూజ పూర్తి చేస్తాం. అయినా కూడా మనం చివరిలో ‘మంత్ర హీనం, క్రియా హీనం, భక్తి హీనం’ అంటూ మంత్రం పఠిస్తాం. అంటే ఏదో మనం భక్తిగా పూజ చేయలేదన్నట్టుగా.. మంత్ర పఠనం సరిగ్గా చేయలేదన్నట్టుగా అర్ధం వచ్చేలా ఎందుకు మంత్రాన్ని పఠించాలి? అనే అనుమానం చాలా మందికి ఉంటుంది. దీనికి కారణం లేకపోలేదు. శాస్త్రం చెప్పిన ప్రకారమే పూజ చేసినా, మనకు తెలిసీ తెలియక కొన్ని పొరపాట్లు దొర్లవచ్చు. దీనిలో కాలదోషం కూడా ఉండవచ్చు. అంటే ఏ సమయంలో పూజ చేయాలో కచ్చితంగా తెలుసుకోలేనప్పుడు ఇది జరుగుతుంది.

పైగా కొన్ని సందర్భాల్లో కొన్ని మంత్రాల్లో పైకి చెప్పేవి ఉంటాయి. కొన్ని పైకి చెప్పకూడనివి సైతం ఉంటాయి. మనం పఠించే మంత్రంలోనూ స్వర లోపమూ.. ఉచ్ఛారణ దోషమూ ఉండవచ్చు. అవి కూడా దోషాలే. ఇవి మాత్రమే కాకుండా నివేదన లోపం, అశౌచాలు, కొన్ని క్రియలు అటు ఇటు కావడం.. హడావుడిలో భక్తి నిలబడకపోవడం, దైవ సేవలో పరధ్యానం వంటివన్నీ దోషాలే. అంతేకాకుండా పూవులు, గంధమూ మొదలైన పూజా సామగ్రిని బయటి నుంచి తీసుకొస్తాం. అందులో మన ప్రమేయం లేకుండానే దోషం తలెత్తవచ్చు. ఇలాంటి దోషాలకు మనం స్వామివారికి క్షమించమని కోరుకుంటూ మంత్రం పఠిస్తూ ఉంటాం.

Share this post with your friends